తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు అడ్డుకోండి.. చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ

by Prasad Jukanti |   (  Updated:2026-04-21 10:56:33  IST  )

తెలంగాణ ఏర్పాటుపై కూటమి నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను అడ్డుకోవాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు.

తెలంగాణ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు అడ్డుకోండి.. చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్ర విభజనపై వివాదాస్పద మాటలు, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కూటమి నేతలకు అడ్డుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని (Chandrababu Naidu) మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కోరారు. తెలంగాణ ఏర్పాటుపై అనవసర ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదని ఇది మీకు తెలియంది కాదన్నారు. ఏపీలో మీ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ నాయకులొక‌వైపు, జనసేన అధినేతతో పాటు మరోవైపు టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సముచితంగా లేవని రాష్ట్ర విభజన ఏదో అనుచితంగా జరిగినట్టు, అసమంజసంగా తెలంగాణ ఏర్పడినట్టు చేస్తున్న అసందర్భపు వ్యాఖ్యలు తెలుగువారి మధ్య అనవసరమైన స్పర్థలు, వైషమ్యాలు, ద్వేషాలు రగిలించేవిగా ఉంటున్నాయన్నారు. ఇది ఎవరికీ మంచిది కాదని ఏపీలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి పెద్దగా మీరు చొరవ తీసుకొని మీ భాగస్వామ్య పక్షాలైన పార్టీ నేతల వ్యాఖ్యల విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు. ఈ మేరకు ఇవాళ చంద్రబాబుకు పొన్నం బహిరంగ లేఖ రాశారు.

రాష్ట్ర విభజన చట్టబద్ధం:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారని తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకాంక్ష మీకు తెలియంది కాదన్నారు. 2000 తొలి దశకమంతా జరిగిన పోరాటాలకు ఉద్యమాలకు మీరు ప్రత్యక్ష సాక్షి అన్నారు. రాష్ట్ర విభజనలో ప్రతి చర్య చట్టబద్దం, రాజ్యాంగబద్ధం అని లోకసభ, రాజ్యసభ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇలా అన్ని పక్షాల ఆమోదంతో జరిగిన రాష్ట్ర విభజన అనంతరం ఎవరి పంథాలో వారు అభివృద్ధి మార్గంలో సాగుతున్నాయి. ఇటువంటి సయమలో రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ ప్రత్యేక భేటీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్మే విధంగా ఉన్నాయని, ఆంధ్ర ప్రగతికి తెలంగాణ దిష్టి తగిలిందంటూ మీ మరో భాగస్వామి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మనోభావాల్ని కలతకు గురిచేశాయన్నారు. ఇవి తెలుగు వారి మధ్య వైషమ్యాలు పుట్టించేవే! అలా మాట్లాడటం తప్పని మీ మంత్రివర్గ సహచరునికి చెప్పాలన్నారు.

మోడీనే కారణం:

వీటన్నింటికి మూలం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలే కారణం అనుకుంటున్నానని ‘రాష్ట్ర విభజన ద్వారా తల్లి-బిడ్డను విడగొట్టార’ని ఒకమారు, ‘బిడ్డను సంరక్షించడానికి తల్లిని చంపార’ని మరొక సందర్భంలో ఆయన అనుచితంగా మాట్లాడారన్నారు. ‘ఒక ఓటు రెండు రాష్ట్రాల’ని 1997లోనే తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అని బహుశా ప్రధాని మోడీకి తెలియదేమో! మీరు రాజకీయాల్లో ఆయనకన్న సీనియర్ కనుక కూటమి భాగస్వామిగా ప్రధాని నరేంద్ర మోడీకి ఈ విషయం చెప్పాలన్నారు. మరే పార్లమెంటు సభ్యుడూ రాష్ట్ర విభజనపై అనుచిత, అసందర్భ, అన్యాయపు మాటలు మాట్లాడకుండా కట్టడి చేయడంతో పాటు తేజస్వి సూర్య రాష్ట్ర విభజనపై మాట్లాడిన మాటలు లోక్ సభ రికార్డులనుండి తొలగించేలా లోక్‌సభ స్పీకర్‌కు మీరు లేఖ రాయాలని విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాలుగా ఉన్నా తెలుగువారందరం ఐక్యంగా, సామరస్యంతో, పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో సాగటం నేటి తక్షణ అవసరం అని ఇందుకు మీ సంపూర్ణ సహకారం కావాలన్నారు.

కేసీఆర్ పిల్లి శాపనార్థాలకు భయపడం: బీఆర్ఎస్‌కు మంత్రి పొన్నం కౌంటర్

Next Story