- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను ఎడారిగా మారనివ్వం : జేఏసీ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యవసాయ భూములకు నీరు దక్కక బీడు భూములతో ఎడారిగా మారుతుందని, సాగునీటి సమస్య పరిష్కారం కోసం ఉద్యమించి ఎడారిగా మారనివ్వబోమని ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జెఏసి నాయకులు అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యవసాయ భూములకు నీరు దక్కక బీడు భూములతో ఎడారిగా మారుతుందని, సాగునీటి సమస్య పరిష్కారం కోసం ఉద్యమించి ఎడారిగా మారనివ్వబోమని ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జెఏసి నాయకులు అన్నారు. ఆదివారం స్థానిక క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో 'ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జెఏసి' ఆధ్వర్యంలో 'ఉమ్మడి జిల్లా బీడు భూముల సాగునీటి సమస్యకు పరిష్కారం ఎప్పుడు' అనే అంశంపై జెఎసి నాయకులు బెక్కెం జనార్దన్, వీరబ్రహ్మచారి, తిమ్మప్ప అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి తదితర ఉమ్మడి జిల్లా జెఎసి నాయకులు పాల్గొని మాట్లాడారు.
ఎంపీ మల్లురవి మాట్లాడుతూ, ఉమ్మడి మహబూబ్ నగర్ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ప్రాజెక్టుల సాధనకు తనవంతు కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసం చేసిందని, ప్రాజెక్టులను పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్లుగా హంగామా చేసిందన్నారు. నేటి పరిస్థితి చూస్తే మళ్ళీ నాటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమమే గుర్తుకొస్తుందని అన్నారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని ఆయన అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పై కోర్టులో కేసు ఉన్నందున పూర్తి చేయలేకపోయామన్నారు. మన కళ్ల ముందే నీరు ఉన్నా మనం వాడుకునే పరిస్థితి లేదన్నారు. నల్లగొండ-మహబూబ్ నగర్ కు లింక్ చేయకుండా మన వాటా నీటిని మనకు కేటాయించాలని డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల జిల్లా పర్యటనలో ఉండి సమీక్షించారని అన్నారు. డిండి నుండి నల్లగొండకు నీళ్లు పంపడానికి సిద్దంగాలేమని, సీఎం దృష్టికి తీసుకెళ్లి డిండి ప్రాజెక్టు పై మాట్లాడుతామన్నారు.
పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ, నీటి వాటాలో ఉమ్మడి జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ, మహబూబ్ నగర్ సాగునీటి ప్రయోజనాలకు గండి కొడుతూ, పాలమూరు-రంగారెడ్డి జిల్లాల ప్రయోజనాలను భంగపరుస్తున్న డిండి ఎత్తిపోతల పేరుతో అక్రమంగా నీరు తరలించే తప్పుడు చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఎందుకు నిర్మించడంలేదని, గట్టు ఎత్తిపోతల పథకం పనులు ఆపేశారని, వెల్టూరు-గొందిమల్ల ఊసే ఎత్తడం లేదని ఆయన ఆరోపించారు. బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ, నల్లగొండ జిల్లాకు అవసరమైన నీటిని నాగార్జునసాగర్-గొట్టిముక్కుల లిఫ్ట్ ద్వారా తరలించవచ్చన్నారు. కల్వకూర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు పూర్తి చేసి, వాటి నికర జలాలను సాధించాలని అన్నారు. వీరబ్రహ్మచారి మాట్లాడుతూ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీడు భూములకు శాశ్వత నీటి వాటా దక్కె వరకు జెఎసి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు చెన్నకిష్టన్న, పరమేశ్వర్, కెసీ వెంకటేశ్వర్లు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






