పార్కులోకి పోవాలంటే గేటు దూకాల్సిందే...

by Batti.Sumithra |

ఆరోగ్యం, మానసికోల్లాసం, వ్యాయామం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి పార్కులను ఏర్పాటు చేస్తే, వాటి నిర్వహణ లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పార్కులు నిరుపయోగంగా మారుతున్నాయి.

పార్కులోకి పోవాలంటే గేటు దూకాల్సిందే...
X

దిశ, మహబూబ్‌నగర్ ప్రతినిధి : ఆరోగ్యం, మానసికోల్లాసం, వ్యాయామం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి పార్కులను ఏర్పాటు చేస్తే, వాటి నిర్వహణ లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పార్కులు నిరుపయోగంగా మారుతున్నాయి. ఇందుకు నిదర్శనం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న పెద్ద పార్కే. గత నెల 23న స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామాంజుల రెడ్డి 21వ డివిజన్‌లోని శ్రీనివాస కాలనీలో గల పెద్ద పార్కును సందర్శించి అక్కడి పరిస్థితులను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్కా... పందుల కొట్టమా అని వ్యాఖ్యానిస్తూ మండిపడ్డారు. పార్కు మొత్తం అపరిశుభ్రంగా ఉండడం, అక్కడ విరిగిపోయి పడి ఉన్న జిమ్ పరికరాలు, ఎండిపోయిన చెట్లు, తాగి పడేసిన మద్యం సీసాలు, బాత్‌రూమ్‌లో నిరోధ్ ప్యాకెట్లను చూసి నిర్వాహకులపై విరుచుకుపడ్డారు.

విరిగిపోయిన జిమ్ పరికరాలను వెంటనే మరమ్మతులు చేయించాలని, ఉదయం 6 గంటలకల్లా పార్కును తెరిచి శుభ్రపరచాలని ఆదేశించారు. అయినా కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను సిబ్బంది బేఖాతరు చేశారు. ఉదయం 7 గంటలైనా పార్కు గేటు తెరవకపోవడంతో ఉదయాన్నే పార్కుకు వచ్చిన సందర్శకులు గేటు దూకి పార్కులోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. విరిగిపోయిన జిమ్ పరికరాలను వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించినా పట్టించుకోకుండా అలాగే పడేశారు. వాడుకలో ఉన్న జిమ్ పరికరాలు తుప్పు పట్టి ఎప్పుడు విరిగిపోతాయోననే భయంతో వ్యాయామం చేయడానికే ప్రజలు జంకుతున్నారు. అంతేకాకుండా, వర్షం వస్తే వాకింగ్ ట్రాక్ బురదమయంగా మారి వాకర్లు జారిపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ పార్కు ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా నిరుపయోగంగా మారే పరిస్థితులు నెలకొంటాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్పందించి పార్కులోని పరిస్థితులను చక్కదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story