చనిపోయిన వ్యక్తిని కూడా వదలని చిన్మయి..నటి కస్తూరి సీరియస్ వార్నింగ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-22 08:34:59  IST  )

కేరళలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

చనిపోయిన వ్యక్తిని కూడా వదలని చిన్మయి..నటి కస్తూరి  సీరియస్ వార్నింగ్
X

దిశ, సినిమా: కేరళలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సోషల్ మీడియా వేదికగా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ఆరోపణల కారణంగా, ఎలాంటి తప్పు చేయకపోయినా మానసిక ఒత్తిడిని తట్టుకోలేక దీపక్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనపై న్యాయం కోరుతూ పలుచోట్ల నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో సింగర్ చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada) చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. డెహ్రాడూన్‌లో ఓ మహిళను వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన వార్తను షేర్ చేస్తూ, “ఒకవేళ ఈ నిందితుడు ఆత్మహత్య చేసుకుంటే.. అది కూడా ఆ మహిళ తప్పే అవుతుందేమో?” అంటూ ఆమె వ్యంగ్యంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. తప్పు చేసి అరెస్టయిన వ్యక్తిని, తప్పుడు ఆరోపణలతో ప్రాణాలు కోల్పోయిన దీపక్‌తో పోల్చడం ఏమిటని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చిన్మయిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. తాజాగా, చిన్మయి వేసిన పోస్ట్‌పై సీనియర్ నటి కస్తూరి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పు చేసిన వ్యక్తికి, అన్యాయంగా బలి అయిన వ్యక్తికి మధ్య ఉన్న తేడాను చిన్మయి గుర్తించలేకపోయారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో వెటకారం సరైనది కాదని, ఒక నిర్దోషి ప్రాణం పోయినప్పుడు కనీస సానుభూతి చూపాల్సిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. “ఇలాంటి హార్ట్‌లెస్ పోస్ట్ నాకు తీవ్రంగా బాధ కలిగిస్తోంది. ఒకరి ప్రపంచంలో పురుషులు లేకుండా కేవలం రాక్షసులు మాత్రమే ఉంటే... స్త్రీలు లేకుండా కేవలం బాధితులు మాత్రమే ఉంటే, అది చాలా ఆందోళన కలిగించే విషయం” అంటూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత హీట్ పెంచాయి. ప్రస్తుతం చిన్మయి - కస్తూరి మధ్య మాటల యుద్ధం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Read More..

కేరళలో దీపక్ ఆత్మహత్యకు కారణమైన ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్

Next Story