- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల మధ్య జల ‘జగడం’.. పరిష్కారానికి కేంద్రం కమిటీ ఏర్పాటు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి దశాబ్ద కాలం దాటినా.. ఇంకా ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి దశాబ్ద కాలం దాటినా.. ఇంకా ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇంతవరకూ పూర్తిస్థాయిలో నీటి కేటాయింపులు జరగకపోవడంతో వివాదాలు రోజురోజుకూ ఎక్కువే అవుతున్నాయి. మరోవైపు.. ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నదని తెలంగాణ.. తెలంగాణనే అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించిందని ఏపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే.. ఈ నీటి వివాదాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, అధికారుల స్థాయిలో కేంద్రంతో ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. అయినా.. సమస్య కొలిక్కి వచ్చింది లేదు. అందుకే.. కేంద్రం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి పంచాయితీకి చెక్ పెట్టేందుకు ఓ కమిటీని నియమించింది.
ఈనెల 2న కమిటీ నియామకం..
ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈనెల 2న కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 15 మంది అధికారులతో కూడిన ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేంద్ర జల్‌శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు కాగా.. దీనికి సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షత వహించనున్నారు. కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వం వహించే ఈ కమిటీలో తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆదిత్యానాథ్‌దాస్‌తోపాటు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, ఏపీ నుంచి ఆ రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నర్సింహామూర్తి, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈలను మెంబర్లుగా నియమించింది. అంతేకాకుండా.. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్ బిశ్వాస్, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్ బీపీ పాండే, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) సీఈ దాస్, సీడబ్ల్యూసీ ప్రాజెక్టు అప్రయిజల్ ఆర్గనైజేషన్(పీఏవో) సీఈ పైథాంకర్‌ను కేంద్రం నుంచి సభ్యులుగా ఈ కమిటీలో చోటు కల్పించారు. అలాగే.. సాంకేతిక నిపుణులను సైతం నియమించుకొనే వెసులుబాటు కల్పించారు.
ఎజెండాలో కీలక సమస్యలు..
ఎజెండాలో కీలకంగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య నీటి నిర్వహణ సమస్యలు చేర్చారు. రెండు రాష్ట్రాలు తమ తమ అభ్యంతరాలు, సమస్యల వివరాలను కమిటీకి సమర్పించాల్సిన అవసరం ఉంది. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు నుంచి సాంకేతిక సూచనలు, డేటా సమర్పించడం ఆవశ్యతను సంతరించుకుంది. నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి పంపిణీ అంశాలపై లోతైన చర్చకు అవకాశం ఉంది. అవసరమైతే నిపుణులు, ఉన్నతాధికారులను కమిటీకి సహభాగితులుగా చేర్చే వెసులుబాటు ఉంది. చైర్మన్ అనుమతితో ఇతర అంశాలపైనా చర్చ జరగనుంది. కాగా.. సమావేశానికి సంబంధిత సభ్యులు పూర్తి సమాచారం, అవసరమైన డాక్యుమెంట్లతో హాజరుకావాలని ఇప్పటికే సీడబ్ల్యూసీ చైర్మన్ ఆయా రాష్ట్రాల అధికారులకు సూచించారు. కాగా.. కమిటీ సభ్య కార్యదర్శిగా కేంద్ర జల కమిషన్ ప్రాజెక్ట్ అప్రైజల్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్ రాకేశ్ కుమార్ వ్యవహరించనున్నారు.
30న కీలక భేటీ..
ఈనెల 2న ఈ కమిటీ ఏర్పాటు కాగా.. కమిటీ నేతృత్వంలో ఈనెల 30న కీలక భేటీ జరగనుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్-తెలంగాణ జల వివాదాలపై కేంద్రం కీలక అడుగు పడినట్లే. 30న ఢిల్లీలో కేంద్ర కమిటీ తొలి సమావేశం నిర్వహించనున్నది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వనరుల నిర్వహణపై తలెత్తిన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. 30న ఢిల్లీ సేవా భవన్‌లోని కేంద్ర జల కమిషన్ 3వ అంతస్తులో సమావేశం కొనసాగనుంది. కమిటీ సభ్యులంతా హాజరై ప్రత్యక్ష పద్ధతిలో చర్చలు జరపనున్నారు. కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
వివాదాల పరిష్కారానికి తొలి అడుగు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాల పరిష్కారానికి ఈ సమావేశం కీలక మలుపుగా మారే అవకాశం ఉన్నది. కేంద్రం మధ్యవర్తిత్వంతో సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించే దిశగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తరఫున కొన్ని కీలక వివాదాలను చర్చించనున్నట్లు తెలిసింది. అందులో ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్నదని మొదటి నుంచి ఆరోపిస్తున్న పోలవరం-నల్లమలసాగర్ మీద చర్చ జరపనున్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం వరద జలాల పేరిట నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోకుంటే తెలంగాణకు భారీ నష్టం కలుగుతుందని చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా సుప్రీంకోర్టులోనూ కేసు వేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా నియామకం అయిన కమిటీ.. అందులోనూ మొదటి సమావేశం నిర్వహిస్తున్న వేళ అందులో ఈ ప్రాజెక్టుకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆ తరువాత కృష్ణా జలాల పంపిణీపై ప్రధానంగా డిమాండ్ చేయనున్నట్లు సమాచారం.
Read More..






