బీఆర్ఎస్‌కు గతం తప్ప భవిష్యత్తు లేదు.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్‌చాట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-13 11:29:38  IST  )

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, ఆ పార్టీకి గతం తప్ప భవిష్యత్తు లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

బీఆర్ఎస్‌కు గతం తప్ప భవిష్యత్తు లేదు.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్‌చాట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ పని అయిపోయిందని, ఆ పార్టీకి గతం తప్ప భవిష్యత్తు లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఇవాళ గాంధీ భవన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, జిల్లాల విభజనపై చిట్‌చాట్‌‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ కవిత (Kavitha) చేసే వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ దగ్గరే సమాధానం లేదని, దీనిని బట్టే ఆ పార్టీలో అంతర్గత గందరగోళం అర్థమవుతోందని విమర్శించారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా ప్రజలు బలంగా నమ్ముతున్నారని, అందుకే ఆ పార్టీని అంతా దూరం పెడుతున్నారని కామెంట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తమ ‘ప్రజా ప్రభుత్వం’ ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నుంచి రెబల్స్ లేకుండా పకడ్బందీగా వ్యవహరిస్తామని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నియోజకవర్గాల్లో పాత నాయకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాను కూడా తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. జిల్లా పునర్విభజనపై ప్రత్యేకంగా కమిటీ వేసి జిల్లాల సరిహద్దులు, విభజనపై శాస్త్రీయంగా మార్పులు చేర్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భావిస్తున్నారని వెల్లడించారు. సీఎం మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకోరని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించారు. పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో భాగంగా హైదరాబాద్ బయట కేబినెట్ మీటింగ్ పెట్టడం శుభ పరిణామమన్నారు. భూభారతిలో అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ల పదవులను భర్తీ చేస్తామని, డిమాండ్ అధికంగా ఉన్నందున వడపోత జరుగుతోందని తెలిపారు. ఇక చివరగా తెలంగాణ నీటి వాటా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

READ MORE .....

Kavitha: కాంగ్రెస్ పార్టీలోకి కవిత.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన టీపీసీసీ చీఫ్

Next Story