- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలకత్తా ఐ-ప్యాక్ ఆఫీస్ లో ఈడీ సోదాల వివాదం.. బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాల వ్యవహారం అత్యున్నత న్యాయస్థానంలో కీలక మలుపులు తిరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: కలకత్తా ఐ-ప్యాక్ ఆఫీస్ లో ఈడీ సోదాల వివాదంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకొర్టులో చుక్కెదురైంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాల వ్యవహారం అత్యున్నత న్యాయస్థానంలో కీలక మలుపులు తిరుగుతోంది. ఈడీ సోదాలను రాష్ట్ర యంత్రాంగం అడ్డుకుందన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది.
ముఖ్యమంత్రికి నోటీసులు.. అధికారులపై స్టే
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ పోలీసు అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈడీ అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, వారిపై తప్పుడు కేసులు నమోదు చేశారన్న వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో, దర్యాప్తు కోసం ఐ-ప్యాక్ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఈడీ అధికారులపై బెంగాల్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ (FIR)పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది దర్యాప్తు సంస్థకు పెద్ద ఊరటగా మారింది.
బెంగాల్ ప్రభుత్వ వాదనలు తోసిపుచ్చిన కోర్టు
ఈ వివాదం రాష్ట్రానికి సంబంధించినదని, దీనిని కలకత్తా హైకోర్టులోనే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థల విధుల్లో రాష్ట్రాల జోక్యం వంటి అంశాలు లోతైన రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని, అందుకే వీటిని తామే స్వయంగా విచారించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 10న జరగబోయే విచారణలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరణపై ప్రస్తుతం అందరి దృష్టి పడింది.
సాక్ష్యాల భద్రతపై కఠిన ఆదేశాలు
సోదాల సమయంలో అసలు ఏం జరిగిందనే నిజాన్ని నిర్ధారించడానికి సాక్ష్యాలు చాలా కీలకమని కోర్టు అభిప్రాయపడింది. అందుకే, ఐ-ప్యాక్ కార్యాలయంలోని సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీని, అలాగే ఆ పరిసర ప్రాంతాల్లోని కెమెరా రికార్డింగులను ఎట్టి పరిస్థితుల్లోనూ చెరిపివేయకుండా భద్రపరచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.






