కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, శిథిలాల కింద మరికొందరు!

by Malleboina Mahesh |   (  Updated:2026-04-05 09:25:13  IST  )

కోత్మాలో 4 అంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు మృతి! శిథిలాల కింద పలువురు. కొనసాగుతున్న ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు.

కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, శిథిలాల కింద మరికొందరు!
X

దిశ, వెబ్ డెస్క్: భారీ భవనం కుప్పకూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ షాకింగ్ ఘటన శనివారం రాత్రి మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లా కోత్మా పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు మరణించగా, శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కోత్మా ప్రధాన మార్కెట్ ప్రాంతంలోని ఒక 4 అంతస్తుల పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో నివసిస్తున్న వారితో పాటు కింద ఉన్న దుకాణాల్లో కొందరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. శిథిలాల నుంచి ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. అలాగే గాయపడిన మరో ముగ్గురిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘోర ప్రమాద సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ (NDRF), స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రాత్రి నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రమాదంలో కూలిన భవనం చాలా పాతది కావడం, ఇటీవలే కురిసిన వర్షాల వల్ల పునాదులు బలహీనపడటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. శిథిలాల కింద ఇంకా ఎంత మంది ఉన్నారనేది స్పష్టంగా తెలియకపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

లోయలో పడ్డ పర్యాటకుల వాహనం.. నలుగురు మృతి

Next Story