- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోయలో పడ్డ పర్యాటకుల వాహనం.. నలుగురు మృతి
కులులో పర్యాటక వాహనం లోయలో పడి నలుగురు మృతి! 14 మందికి గాయాలు. వర్షం కారణంగా జారిన రహదారి. ఢిల్లీకి చెందిన పర్యాటకులుగా గుర్తింపు.

దిశ, వెబ్ డెస్క్: పర్యాటకులతో వెళ్తున్న వాహనం అర్ధరాత్రి అదుపుతప్పి లోయలో పడిపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో శనివారం రాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బంజార్ సబ్ డివిజన్ పరిధిలోని ఘియాగి (Ghiyaghi) సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పర్యాటకులు ప్రయాణిస్తున్న టెంపో ట్రావెలర్ నియంత్రణ తప్పి రహదారి పక్కనే ఉన్న లోతైన లోయలోకి దూసుకెళ్లినట్లు గుర్తించారు.
భారీ వర్షాల కారణంగా రహదారిపై ఏర్పడిన బురద, జారే స్వభావం వల్ల వాహనం స్కిడ్ అయ్యి లోయలో పడిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 22 మంది ఉన్నారని,.. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే బంజార్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యాటకులంతా ఢిల్లీ నుంచి కులు మనాలీ సందర్శనకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గురైన వారు జిబి (Jhibi) లోని ఒక హోటల్‌లో బస చేస్తున్నట్లు సమాచారం. మృతుల వివరాలను సేకరించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.






