- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్‌కు ‘ధరల’ గండం.. అభ్యంతరాలు లేవనెత్తిన ‘TANHA’
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ (NEHS) ధరల వివాదంలో చిక్కుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (EHS)లో వైద్యసేవలు ఓ కొలిక్కి రావడం లేదు. ప్రభుత్వం ఖరారుచేసిన సీజీహెచ్ఎస్ ప్యాకేజీ ధరలు తమకు ఏమాత్రం సరిపోవడం లేదని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(టన్హా) పేర్కొంటున్నది. అయితే అప్పటికే ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి రెండు నెలల వేతనాల కటింగ్ పూర్తి కావడంతో పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చివరికి తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(టిషా) సేవలు అందించేందుకు ముందుకు రావడంతో ఈ నెల 17న సచివాలయంలో కొత్త హెల్త్ కార్డులను అందిస్తూ ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ, కేవలం నగరంలోని ‘టిషా’ పరిధిలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ మాత్రమే సేవలు అందిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా ప్రాంతాల వారికి వైద్యం ఎలా అందుతుందనే అంశంపై గందరగోళం నెలకొంది.
జిల్లాల ఉద్యోగులకు తిప్పలే..
నెలనెలా తమ జీతంలో 1.5 శాతాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చెల్లిస్తున్నా, కేవలం హైదరాబాద్‌లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మాత్రమే వైద్యసేవలు అందుబాటులో ఉంచితే తమకు తీవ్రనష్టం కలుగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న వైద్యచికిత్సల కోసం సైతం ప్రతిసారీ జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ రావడం కష్టసాధ్యమని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఎన్ఈహెచ్ఎస్ కోసం ఏర్పాటుచేసిన అధికారిక వెబ్‌సైట్‌లో నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఖ్యను 886గా చూపించినప్పటికీ క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉంది. ప్రస్తుతం అందులో ఉన్న 354 ఆస్పత్రులతో పాటు ఈ నెలాఖరు వరకు మిగతా 532 హాస్పిటల్స్ సేవలను ఫేజ్-2లో భాగంగా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతున్నది. కానీ, వెబ్‌సైట్‌లో ఉన్న సదరు ఆస్పత్రులను సంప్రదించగా.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు తాము వైద్యం అందించేందుకు సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు.
టన్హా అభ్యంతరాలు
* ఆరోగ్యశ్రీ పథకంలో కొన్ని రోగాలకు ఇచ్చే రేట్ల కంటే ఉద్యోగులు డబ్బులు చెల్లించే ఈహెచ్ఎస్‌లో రేట్లను దారుణంగా తగ్గించారని టన్హా చెబుతున్నది. ఉదాహరణకు యూరాలజీలో యుఆర్ఎస్ఎల్ ప్రొసీజర్‌కు కొత్త ఆరోగ్యశ్రీలో రూ.44,900 ఇస్తుండగా, పాత ఈహెచ్ఎస్‌లో రూ.27,400 ఉండేదని.. కానీ ఇప్పుడు కొత్త ఈహెచ్ఎస్ కింద దాన్ని కేవలం రూ.23,800 (సీజీహెచ్ఎస్ రేట్లు) కు తగ్గించారని పేర్కొన్నది.
* ఆర్థోపెడిక్ లాంగ్ బోన్ ఫ్రాక్చర్ చికిత్సకు పాత ఈహెచ్ఎస్‌లో రూ.32,100 ఉండగా, సవరించిన కొత్త ఆరోగ్యశ్రీలో రూ.40వేలు ఇస్తుంటే.. కొత్త ఈహెచ్ఎస్ కింద ఆస్పత్రులకు కేవలం రూ.26,500 మాత్రమే ఇస్తామనడం సరికాదని పేర్కొంటున్నారు. ఈ రేటు కనీసం రూ.45వేలు ఉండాలని, సైంటిఫిక్ కాస్టింగ్ ప్రకారం చూస్తే రూ.75వేలు మేర అవుతుందని అంటున్నారు.
* సీజీహెచ్ఎస్ విధానం ప్రకారం ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఇన్ పేషెంట్‌ను విజిట్ చేస్తే రోజుకు ఇచ్చే ఫీజు కేవలం రూ.50 మాత్రమేనని, ఇంత తక్కువ మొత్తానికి ఏ నిపుణుడు వైద్యం అందిస్తాడని టన్హా ప్రశ్నిస్తున్నది.
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల సేవలే మేలు!
ఉద్యోగులు, పెన్షనర్ల కంట్రిబ్యూషన్ ద్వారా నెలకు రూ.45 కోట్లు, ప్రభుత్వ వాటా రూ.45 కోట్లు కలిపితే నెలకు రూ.90 కోట్ల నిధి సమకూరుతుంది. అంటే ఏడాదికి సుమారు రూ.1,080 కోట్ల భారీ మొత్తం ఈ హెల్త్ స్కీం కోసం అందుబాటులో ఉంటుంది. ఇన్ని నిధులు ఉన్నప్పుడు నేరుగా ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటే చక్కటి క్యాష్ లెస్ వైద్యసేవలు పొందవచ్చని ఆరోగ్య రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాగైతే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే వీలుంటుందని అభిప్రాయపడుతున్నారు. 15ఏళ్ల క్రితం ఉన్న రేట్లతో ఇప్పుడు వైద్యసేవలు అందించడం కుదరదని ‘టన్హా’ కార్యవర్గ సభ్యుడు, పీడియాట్రీషియన్ డాక్టర్ జి.రమేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండివైఖరితో ముందుకెళ్లాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, అవసరమైతే జిల్లాల్లో ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మహబూబ్ నగర్ కు చెందిన ఓ ప్రముఖ వైద్యుడు హెచ్చరించారు.
ప్రైవేటు ఆస్పత్రులు సహకరించాలి
ప్రభుత్వం ఎన్ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులు, పెన్షనర్ల కోసం చక్కని పథకాన్ని తీసుకువచ్చింది.అమలు కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ సహకరించాలి. హెల్త్‌కేర్త్ ట్రస్ట్ బోర్డుతో పాటు నెట్‌వర్క్ ఆస్పత్రుల నిర్వాహకులతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నాం. సర్వీస్ ప్రొవైడర్స్ అయిన హాస్పిటల్స్ కు ఎన్ఈహెచ్ఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు కల్పించేందుకు మాకు అభ్యంతరం లేదు. సీజీహెచ్ఎస్ ధరల విషయంలో తేడాలుంటే కూర్చుని మాట్లాడుకుని సవరించుకునేందుకు అవకాశం ఉంది. - ఏలూరి శ్రీనివాస్ రావు, టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు
ఈ ధరలతో వైద్యం అసాధ్యం
రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్న సీజీహెచ్ఎస్ ధరలతో నూతన ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ కింద వైద్యసేవలు అందించలేం. ఆరోగ్యశ్రీ, పాత ఈహెచ్ఎస్ ధరల కంటే చాలా తక్కువగా ఇవ్వడం సరికాదు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, పాలసీ మేకింగ్, ఇంప్లిమెంటేషన్ బోర్డులో అసోసియేషన్ సభ్యులకు స్థానం కల్పించాలి. 14 నెలలుగా పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయాలి. రెండేళ్లుగా రావాల్సిన ఈహెచ్ఎస్ బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయాలి. అందరికీ ఆమోదయోగ్యమైన రేట్లను ఖరారు చేస్తేనే ఉద్యోగులకు సరైన వైద్యం అందుతుంది. - డాక్టర్ వద్దిరాజు రాకేశ్, ‘టన్హా’ రాష్ట్ర అధ్యక్షుడు






