- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి సెటిల్మెంట్లు.. ఇల్లీగల్ లాగిన్లు! ‘ధరణి’ ఫోరెన్సిక్ ఆడిట్‌లో విస్తుపోయే నిజాలు
ధరణి, భూ భారతి పోర్టళ్ల లొసుగులతో తెలంగాణ రెవెన్యూ శాఖలో ‘దండుపాళ్యం’ బ్యాచ్ అర్ధరాత్రి సెటిల్‌మెంట్లకు తెరలేపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి, భూ భారతి డిజిటలైజేషన్, రిజిస్ట్రేషన్, డేటా కరెక్షన్స్ ప్రక్రియను అడ్డం పెట్టుకొని రెవెన్యూ శాఖలోనే కొందరు ‘దండుపాళ్యం’ బ్యాచ్‌గా ఏర్పడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు ఉన్నతాధికారుల సహకారంతో గ్రూపులుగా ఏర్పడి సెటిల్‌మెంట్లు, దందాలు నడిపారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోర్టళ్లలోని లొసుగులను ఆధారంగా చేసుకొని, ఇల్లీగల్ లాగిన్ల ద్వారా వేల ఎకరాల క్లాసిఫికేషన్, హక్కులను మార్చేసినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తున్నది. అర్ధరాత్రి సెటిల్మెంట్లు, రిజిస్ట్రేషన్లు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం కూడా గుర్తించింది. ఇప్పటికే రంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో పూర్తయిన ఆడిట్‌లోనే వేలాదిగా అక్రమాలు ఉంటే.. మిగతా 31 జిల్లాల్లో పూర్తయితే మరెన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయేమోననే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కుకునూరుపల్లి తహసీల్దార్‌ను సస్పెండ్ చేసింది. సుమారు 60 వరకు అసైన్డ్‌ల్యాండ్స్‌ను పట్టాలుగా మార్చారనే ఆరోపణలు అధికారిపై ఉన్నట్టు తెలుస్తున్నది. కాగా, మిగతా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు కూడా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ప్రశ్నలే సంధిస్తుండటం గమనార్హం. పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ బయటపడితేనే ఎవరెవరి లాగిన్ల ద్వారా అక్రమాలు చోటుచేసుకున్నాయో వెలుగులోకి వచ్చే అవకాశముంది.
తప్పు చేస్తే క్రిమినల్ యాక్షన్
ప్రభుత్వ భూములకు మోసపూరితంగా పాసుపుస్తకాలు జారీ చేసినప్పుడు భూ భారతి చట్టం సెక్షన్ 19, 20 కింద వాటిని రద్దు చేసి స్వాధీనం చేసుకునే అధికారం సీసీఎల్ఏకు ఉంది. రికార్డులను ట్యాంపర్ చేస్తూ అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్లు, ఇతర అధికారులపై క్రిమినల్, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు సర్వీస్ నుంచి తొలగించవచ్చు. అయితే, సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలకు మాత్రమే చట్టపరమైన మినహాయింపు ఉంటుంది. ఆరేండ్ల కాలంలో లెక్కలేనన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయి. వేలాది ఎకరాల భూములు చేతులు మారగా.. రూ.వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. 2018కి ముందు, ఆ తర్వాత పరిశీలిస్తే ప్రభుత్వ భూముల లెక్క తెలుస్తుంది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ జిల్లాల డేటా తీసుకుంటే ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో తెలిసిపోతుంది. గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో కింది నుంచి రిజెక్ట్ చేస్తూ సమర్పించిన ఫైళ్లను ఉన్నతాధికారులు నేరుగా అప్రూవ్ చేశారని తెలిసింది. అందుకే ఇప్పుడు అక్రమార్కులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా? లేదా? అన్న చర్చ నడుస్తున్నది.
ఒక్క అధికారిపైనే చర్యలెందుకు?
ధరణితో పాటు భూభారతిలోనూ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్, డేటా కరెక్షన్స్ చోటు చేసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కుకునూరుపల్లితో పాటు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్, రావిర్యాల, మేడ్చల్ జిల్లా ఉప్పల్ ఖల్సా, కూకట్‌పల్లి ప్రాంతాల్లోనూ ఉన్నాయని ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా బయటపడినట్టు తెలిసింది. అయితే, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా ఒక్క కుకునూరుపల్లి తహశీల్దార్‌పైనే ఎందుకు సస్పెన్షన్ వేటు వేశారో అర్థం కావడం లేదని రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకవేళ అసైన్డ్ ల్యాండ్స్ ఇష్యూనే అయితే.. శేరిలింగంపల్లి మండలంలో అసైన్డ్ ల్యాండ్స్‌కు క్లియరెన్స్ ఇచ్చిన డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్‌పై యాక్షన్ తీసుకోవాలి కదా! అనే చర్చ జరుగుతున్నది. ఖానామెట్‌లో అసైన్డ్‌ల్యాండ్స్‌లో హైరైజ్డ్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. ఈ అంశంపై శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులను అడిగితే నోటీసులు జారీ చేశామని చేతులు దులుపుకుంటున్నారు. అంతేకాకుండా మండల పరిధిలోని ప్రతి గ్రామంలోని అసైన్డ్ ల్యాండ్స్‌లో అపార్టుమెంట్స్, కమర్షియల్ కాంప్లెక్సులు కనిపిస్తున్నాయి. గండిపేట, బాలానగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, నిజాంపేట, బాలాపూర్, మేడ్చల్ మండలాల్లోనూ అసైన్డ్ ల్యాండ్స్ కనుమరుగయ్యాయి. మరి ఆ డేటాను మార్చి అనుమతులు జారీ చేసిన వారిపైనా యాక్షన్ ఉండాలి కదా? అని జనం గుర్తు చేస్తున్నారు.
ఎవరి కోసం?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అనేక ఫైళ్లు చకచకా కదిలాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పారో, లేదో కానీ వాళ్ల పేరిట ప్రచారం మాత్రం జోరుగా సాగింది. ఎవరేం చెప్పినా కొందరు తహసీల్దార్లు మాత్రం బడాబాబులకు అనుకూలంగా రిపోర్టులు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా రికార్డులన్నీ పరిశీలించి ఉన్నది ఉన్నట్టుగా రిపోర్టులు ఇచ్చిన తహసీల్దార్లు, ఆర్డీవోలు ఉన్నారు. ఇంకొందరేమో ఉన్నతస్థాయి అధికారులు, పెద్దోళ్ల నుంచి ఒత్తిళ్లు వచ్చాయంటూ అనుకూలంగా రాసిన వాళ్లూ ఉన్నారు. అప్పట్లోనే కొందరు తహసీల్దార్లు తాము రిజెక్ట్ చేసిన ఫైళ్లు కూడా ఆమోదించిన సందర్భాలు ఉన్నాయన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో దరఖాస్తు పెట్టుకొని ఒక్క రోజులోనే క్లియర్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. అంటే అప్లయ్ చేయడమే తరువాయి.. ఇలా ఆమోదిస్తూ రికార్డులు మారిన ఉదాహరణలు ఉన్నాయి. ఏ అప్లికేషన్ ఎప్పుడు పెట్టారు? ఎప్పుడు ఆమోదించారు? ఈ లెక్క తీస్తే చాలు.. ఎవరి కోసం? ఎవరు పని చేశారు? అనేది ఈజీగానే బయటపడుతుంది. సామాన్యుల ఫైళ్లు మూడేండ్లు తిరిగినా ఇంకా కలెక్టర్ పరిశీలనలోనే ఉందని కనిపిస్తున్నది. అదే మండలంలో కొందరు అప్లయ్ చేసి 24 గంటలు గడవక ముందే క్లియర్ చేశారు. ధరణి పోర్టల్‌లో తహసీల్దార్ రిపోర్ట్ అనుకూలంగా ఇస్తేనే ఆర్డీవో, ఆర్డీవో రికమండ్ చేస్తేనే అదనపు కలెక్టర్, ఆయన క్లియర్ చేస్తేనే కలెక్టర్ ఎన్వోసీ ఇవ్వాలన్నా రూల్ ఏం లేదు. ఇవేవీ ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే ఫైళ్లు కావు. కేవలం ఫిజికల్‌గా ఉండేవి మాత్రమే. అందుకే నామ్‌కే వాస్తే రిపోర్టులతోనే ఎన్వోసీలు, పీవోబీ క్లియరెన్స్‌లు ఇచ్చారన్న అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే అమోయ్ కుమార్ హయాంలో పనిచేసిన తహసీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు సేఫ్‌గా ఉన్నారు.
ఎలా కట్టబెట్టారు?
-మియాపూర్ సర్వే నం.100లో రూ.వేల కోట్ల విలువైన ల్యాండ్‌కు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులకు హక్కులు కల్పించారు. వెంటనే ఆధార్, ఈ కేవైసీ పూర్తి చేసి పట్టాదారు పాసు పుస్తకం జారీచేశారు. పైగా ఈ సర్వే నంబరులోని ల్యాండ్‌పై క్రయ విక్రయాలు చెల్లవని పీవోబీలో ఉన్నది. కానీ ఈ అదృశ్య శక్తికి ఎలా కట్టబెట్టారన్నది ప్రశ్న? ఎక్కడి నుంచి ఎన్వోసీ లభించింది? ఈ విషయాన్ని శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులను అడిగితే తమకేం తెలియదంటున్నారు. ఈ ల్యాండ్ క్లియరెన్స్‌కి తాము ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదంటున్నారు. కింది స్థాయి సిబ్బంది నుంచి రిపోర్టు లేకుండానే చేర్పులు మార్పులు ఎలా జరిగాయి? ఏ చిన్న మ్యుటేషన్, పీవోబీ తొలగింపు, తప్పొప్పుల సవరణకైనా తహసీల్దార్ నుంచి రిపోర్ట్ అడుగుతారు. మరి ఇంతటి ఖరీదైన ల్యాండ్‌కు ఎలాంటి రిపోర్టు లేకుండానే చేశారా? ఎవరి లాగిన్ నుంచి పూర్తయ్యిందో తెలియడం లేదు.
అందినంత కబ్జా
- మియాపూర్ సర్వే నం.100, 101లోని 550 ఎకరాల భూమి ఎంతో కాలంగా వివాదాస్పదంగానే కొనసాగుతున్నది. అందరూ అందినంత కబ్జా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ వేలం వేస్తే ఎకరం రూ.100 కోట్లు పలుకుతుంది. అలాంటి ఖరీదైన భూమిని కాపాడే బాధ్యత ఎవరిది? హెచ్ఎండీఏకి అప్పగించినప్పటి నుంచి ఎంత ల్యాండ్ అదృశ్యమైంది? ఏనాడైనా రెవెన్యూ అధికారులు ఈ ల్యాండ్‌ని కాపాడే ప్రయత్నం చేశారా? కనీసం పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారా? ఖాళీగా వదిలేయడం ద్వారా అనేక వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇక్కడా చోటు చేసుకున్న డేటా కరెక్షన్‌ని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా తెలుసుకునే వీలుందని టెక్నికల్ నిపుణులు అంటున్నారు.
– శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ సర్వే నం.27లోని ప్రభుత్వ భూమి ఎంత? ఇప్పుడు ఎవరి పేరిట ఎంత విస్తీర్ణం ఉంది? అనే లెక్క తీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కలెక్టర్ అప్రూవ్ చేస్తే సీసీఎల్ఏ హోల్డ్‌లో పెట్టారు. ఆ తర్వాత ఏమైంది? క్లియరెన్స్ ఇచ్చారా? దశాబ్దాలుగా పట్టా భూమిగా మార్చాలన్న విజ్ఞప్తులకు ఏ ఐఏఎస్ అధికారి, ఏ ఆర్డీవో, ఏ తహసీల్దార్ నిర్ణయం తీసుకోలేదు. కానీ, మూడేండ్ల క్రితం ఎలా, ఎవరి ఒత్తిడిమేరకు చేశారు. ఎవరి లాగిన్ నుంచి చేశారు?
– గండిపేట మండలం గంధంగూడ సర్వే నం.51లో 9.36 ఎకరాల భూమిపై కలెక్టర్ అమోయ్ కుమార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కనీసం అంతకు ముందు పనిచేసిన రఘునందన్ రావు వంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎందుకు తిరస్కరించారని కూడా స్టడీ చేయకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గండిపేట తహసీల్దార్ పంపిన రిపోర్టు మేరకు ట్రిబ్యునల్ ఆర్డర్ అంటూ జారీ చేసి ధారదత్తం చేసేశారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. పూర్తిస్థాయి ఆడిట్ ద్వారా ఇలాంటివి ఎన్నో వెలుగులోకి వస్తాయి.






