నామినేటెడ్ పదవులకు రూ.కోట్లు డిమాండ్.. కీలక నేతల పేర్లతో కాంగ్రెస్‌లో వసూళ్ల పర్వం!

by Kema Shiva Kumar |

తెలంగాణలో నామినేటెడ్ పదవుల వేటలో ఆశావహుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు నేతలు కోట్లలో వసూళ్లకు తెరలేపారు.

నామినేటెడ్ పదవులకు  రూ.కోట్లు డిమాండ్.. కీలక నేతల పేర్లతో కాంగ్రెస్‌లో వసూళ్ల పర్వం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయాల్లో ఎదిగేందుకు నామినేటెడ్ పదవి ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది. దీంతో ఆ పదవులు సంపాదించాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఆశావహుల్లోని ఆ బలహీనతనే కాంగ్రెస్‌లోని కొందరు లీడర్లు సొమ్ము చేసుకునే పనిలో పడినట్టు ప్రచారం జరుగుతున్నది. నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామంటూ భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కోరుకున్న పదవి ఇప్పిస్తామని ఆశచూపి రూ. లక్షల్లో అడ్వాన్సులు తీసుకుంటున్నట్టు చర్చ జరుగుతున్నది. దీంతో ఈ విషయాన్ని కొందరు పార్టీలోని కీలక నేతలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

డిమాండ్‌ను బట్టి రేటు..

ఇటీవల పదవీకాలం ముగిసిన 37 కార్పొరేషన్లతో పాటు ఖాళీగా ఉన్న మరికొన్ని సంస్థలకు చైర్మన్లు, వైస్‌చైర్మన్లు నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా ఆశావహుల జాబితాను అటు ప్రభుత్వం, ఇటు పార్టీ వర్గాలు విడివిడిగా తయారు చేసినట్టు తెలిసింది. త్వరలో అర్హులను ఎంపిక చేసి, జాబితాను ప్రకటిస్తారని జోరుగా ప్రచారం సాగుతున్నది. ఒక్కో పదవికి సుమారు 50 మంది వరకు పోటీ పడుతున్నారు. పదవి దక్కించుకునేందుకు ఎవరికి వారే పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. తమకు సన్నిహితులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లెటర్లు తీసుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లి పరిచయమున్న ఏఐసీసీ నేతల ద్వారా రాష్ట్ర నేతలకు ఫోన్లు చేయించే పనిలో ఉన్నారు. ఇన్ని చేసినా పదవి వస్తుందనే నమ్మకం మాత్రం కుదరడం లేదు. ఇదిలాఉంటే.. ‘రూ.అర కోటి ఇస్తే పదవి పక్కా’ అంటూ కొందరు సీనియర్ నేతల మాటలకు ఆశావహులు ఆకర్షితులై డబ్బులు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే, అన్ని పదవులకు ఒకే రేటు లేదు. కొన్ని కీలకమైన పదవులకు రూ.కోటిపైనే రేటు చెబుతున్నట్టు టాక్ ఉంది.

కీలక నేతల పేర్లతో దందా

పదవులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్న నేతలు అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఉండే నేతలకు సన్నిహితులుగా చెప్పుకుంటున్నట్టు తెలిసింది. తాము చెప్పిన మాటను బాసులు కాదనరనే నమ్మకం కలిగించి, డబ్బులు గుంజుతున్నట్టు సమాచారం. ఈ దందాలో కొందరు ఏఐసీసీ నేతల పేర్లను, ఇంకొందరు పీసీసీలోని కీలక నేతల పేర్లను ఉపయోగిస్తుండగా, మరికొందరు ప్రభుత్వంలోని పెద్దల పేర్లు చెప్పి వసూళ్లు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే, మొత్తం సొమ్మును ముందే ఇవ్వాల్సిన అవసరం లేదని వెసులుబాటు ఇస్తున్న మధ్యవర్తులు.. అడ్వాన్సుగా కొందరి నుంచి రూ. 10 లక్షలు, మరికొందరు వద్ద రూ. 20 లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం. ఈ దందాను గుర్తించిన కొందరు నేతలు అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో నామినేటెడ్ పదవుల పేర్లతో జరుగుతున్న దందాలో భాగస్వామ్యం ఉన్న నేతల పేర్లను పార్టీ, ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

Next Story