ఆగని రక్తపాతం.. పాక్ సైన్యం - BLA 48 గంటల యుద్ధంలో 225 మంది మృతి

by Malleboina Mahesh |   (  Updated:2026-02-03 05:38:49  IST  )

పాకిస్థాన్‌లో 48 గంటలుగా పాక్ సైన్యం - బలూచిస్థాన్ ప్రావిన్స్ మధ్య భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఆగని రక్తపాతం.. పాక్ సైన్యం - BLA 48 గంటల యుద్ధంలో 225 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌లో 48 గంటలుగా పాక్ సైన్యం - బలూచిస్థాన్ ప్రావిన్స్ మధ్య భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులతో పాటు సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన 'ఆపరేషన్ హెరోఫ్ ఫేజ్-2' (Operation Herof 2.0) ధాటికి పాక్ భద్రతా దళాలు విలవిలలాడాయి. ఈ భీకర దాడులతో ఇరువైపులా కలిపి సుమారు 225 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

12 ప్రాంతాల్లో భీకర దాడులు

గత నెల జనవరి 31 శనివారం ఉదయం ప్రారంభమైన ఈ దాడులు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులు 'ఆపరేషన్ హెరోఫ్ ఫేజ్-2'లో భాగంగా క్వెట్టా, గ్వాదర్, నోష్కీ, మస్తుంగ్ సహా సుమారు 12 జిల్లాల్లో ఏకకాలంలో జరిగాయి. BLA తిరుగుబాటుదారులు పక్కా ప్రణాళికలతో అధునాతన ఆయుధాలు, గ్రెనేడ్లు, ఆత్మాహుతి దళాలతో (Fidayeens) పోలీస్ స్టేషన్లు, హై-సెక్యూరిటీ జైళ్లు, సైనిక స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. ముఖ్యంగా మస్తుంగ్‌లో జైలుపై దాడి చేసి 30 మంది ఖైదీలను విడిపించడం సంచలనం సృష్టించింది.

బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బగ్టి, మిలిటరీ వర్గాల ప్రకారం, ఈ ఆపరేషన్‌లో 177 మంది తిరుగుబాటుదారులను సైన్యం హతమార్చింది. ఈ పోరులో 17 మంది సైనికులు మరణించగా, 31 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. తాము జరిపిన మెరుపు దాడుల్లో 200 మందికి పైగా పాక్ సైనికులను ప్రాణాలు కోల్పోయారని, పలువురిని బందీలుగా పట్టుకున్నామని BLA ప్రకటించింది. అయితే ఈ క్లెయిమ్స్‌ను పాక్ ప్రభుత్వం కొట్టిపారేసింది.

ఈ సంక్షోభానికి అసలు కారణాలు

పాకిస్తాన్ కు సమీప ప్రాంతం అయిన బలూచిస్థాన్‌లో దశాబ్దాలుగా వేర్పాటు వాదం కొనసాగుతోంది. ఈ వేర్పాటువాద పోరాటం వెనుక లోతైన కారణాలు ఉన్నాయి. బలూచిస్థాన్ ఖనిజాలు, సహజ వాయువుకు నిలయం. కానీ ఇక్కడి సంపదను పాక్ ప్రభుత్వం తరలించుకుపోతూ, స్థానికులను దారిద్య్రంలో ఉంచుతోంది. అలాగే గ్వాదర్ పోర్ట్ సహా చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుల వల్ల స్థానికులకు ఎలాంటి ఉపాధి లభించడం లేదని, చైనా పౌరులకు రక్షణ కల్పించే పేరుతో తమపై అణచివేత సాగుతోందని తిరుగుబాటుదారులు ఆగ్రహంగా ఉన్నారు. అలాగే వేలాది మంది బలూచ్ యువకులు కనుమరుగవ్వడం (Forced Disappearances), సైనిక హింస వంటి కారణాలు యువతను ఆయుధాల వైపు మళ్ళిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితి

ఈ దాడుల నేపథ్యంలో ప్రావిన్స్ అంతటా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. హైవేలను సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ దాడుల వెనుక భారత్ హస్తం ఉందని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ ఆరోపించగా, భారత్ ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తమ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పాక్ ఇతరులపై నిందలు వేస్తోందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్న పాకిస్తాన్ కు బలూచ్ వేర్పాటు వాదం, వరుస దాడులు తీరన నష్టాన్ని కలిగిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఆ ఇద్దరు మహిళలు మృతి

Next Story