కేసీఆర్ కొంపముంచుతున్న ‘ముందస్తు’ అభ్యర్థుల ప్రకటన

by Disha Web Desk |
కేసీఆర్ కొంపముంచుతున్న ‘ముందస్తు’ అభ్యర్థుల ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్షాల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి పార్టీలో పరిస్థితులను చక్కదిద్దుకోవాలని చూసిన గూలాబీ బాస్ కేసీఆర్ అంచనాలు తప్పుతున్నాయా? తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తమను విస్మరించడంపై ముదిరాజ్‌లు భగ్గుమంటున్నారు. తమ సామాజిక వర్గానికి కనీసం నాలుగు సీట్లైనా ఇవ్వాలని ప్రతిపాదనలు చేస్తే కేసీఆర్ మాత్రం ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై మండిపడుతున్నారు. తమ సామాజిక వర్గాన్ని విస్మరించిన కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామని, బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమి కోసం పని చేయడంతో పాటు కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఓడించడించేందుకు ముదిరాజ్‌లమంతా నామినేషన్లు వేస్తామని హెచ్చరించడం గులాబీ బాస్‌కు గుబులు పెట్టించే అంశంగా మారింది. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో 'ధర్మ యుద్ధం' పేరుతో ముదిరాజ్‌లు భారీ ర్యాలీ నిర్వహించడం హాట్ టాపిక్ అవుతున్నది.

అంతు చూసే వరకు తగ్గేదే లేదు:

రాష్ట్రంలో ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేస్తోందని, తమ సామాజిక వర్గానికి చెందిన చరిత్రను విస్మరిస్తోందని ముదిరాజ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డిలో నిర్వహించిన ర్యాలీలో భారీ సంఖ్యలో ముదిరాజుల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నాయకులు నిజ్జన రమేశ్ ముదిరాజ్‌తో పాటు పలువురు ముదిరాజ్ సంఘ నాయకులు హాజరై ప్రభుత్వ తీరును నిరసించారు. బీసీ-డీలో ఉన్న తమను బీసీ-ఏలోకి మార్చాలనే తమ డిమాండ్ ను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్ట్ లు, జడ్పీ చైర్మన్ పదవులతో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులలో ఒక్కరు కూడా ముదిరాజ్‌లు లేరని మండిపడ్డారు.

ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ను గాలికొదిలేశారని, మత్స్యకార సొసైటీల్లో సభ్యత్వం ఇస్తామని చెప్పినా అది కేవలం కాగితాలకే పరిమితం అయిందని ఇచ్చిన హామీలన్ని తుంగలో తొక్కారని, మలిదశ ఉద్యమంలో అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చకుండా తమ జాతి వ్యక్తుల చరిత్రను మరుగున పారేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక రాజకీయంగా కూడా బీఆర్ఎస్ తమకు ద్రోహం చేస్తోందని పార్టీ ప్రకటించిన అభ్యర్థులలో ముదిరాజ్‌లకు చోటు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిరాజ్‌లను ఆషామాషీగా తీసుకోవద్దని గజ్వేల్, కామారెడ్డిలో 50 వేల ముదిరాజ్ ఓటర్లు, ఎల్లారెడ్డిలో 70 వేల ముదిరాజ్ ఓటర్లు ఉన్నారని, దీనితో పాటు అనేక నియోజకవర్గాల్లో గెలుపోటములను ముదిరాజ్‌లు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని ఇకనైనా ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకుని ముదిరాజ్‌లకు న్యాయం చేయకుంటే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పే వరకు వెనుకడగు వేయబోమని హెచ్చరించారు.

కేసీఆర్‌కు అగ్నిపరీక్ష:

మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడం అలా ఉంచితే తాను గెలవడం కేసీఆర్‌కు అగ్నిపరీక్షగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టార్గెట్ కేసీఆర్‌గా ప్రణాళికలు రచిస్తున్నాయి. గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్‌కు ధీటైన అభ్యర్థులను అన్వేషిస్తున్నాయి. కేసీఆర్‌ను అష్టదిగ్భందనం చేసి గెలుపు అవకాశాలు లేకుండా చేయాలని చూస్తున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన గులాబీ బాస్ ఇప్పటికే ప్రభుత్వ పరంగా నిధుల కేటాయింపులు, పెండింగ్ పనుల స్పీడ్‌తో ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో అనూహ్యంగా ముదిరాజ్‌లు నామినేషన్లు వేస్తామని హెచ్చరించడంతో కేసీఆర్ గెలుపు నల్లేరు మీద నడకే అవుతాందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Read More : సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసిన ఆ సామాజిక కులస్తులు...తమకు కులస్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం...కేసీఆర్‌కు వ్యతిరేఖంగా భారీగా నామినేషన్లు వేసేందుకు సన్నద్ధం

Next Story

Most Viewed