- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిలకలగూడలో యువకుడి హత్య.. యువతి ఇంటిముందు ఆందోళన
చిలకలగూడలో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థి హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఏడాదిగా యువతికి దూరంగా ఉన్నా చంపేశారంటూ బంధువులు వాపోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు యువకులు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యావన్ (23) అనే యువకుడిని గురువారం రాత్రి నడిరోడ్డుపై దారికాచి మరీ దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. 17 చోట్ల పొడిచి అత్యంత దారుణంగా చంపేశారు. ప్రేమ వ్యవహారమే యువకుడి హత్యకు కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సీతాఫల్ మండికి చెందిన యువతిని యావన్ ప్రేమిస్తుండటమే అతని హత్యకు కారణమని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. యువతిని యావన్ ప్రేమించడాన్ని తెలుసుకున్న ఆమె అన్న పరమేష్, బావ సాయి, మరో నలుగురితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు ఆరోపిస్తూ.. యువతి ఇంటి ముందు యావన్ కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీతాఫల్ మండిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. యువతి ఇంటి గేటుకు బయటి నుంచి లాక్ వేసి ఉండగా.. దానిని పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు యావన్ బంధువులు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ హత్యకేసులో ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నామని చిలకలగూడ పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని తెలిపారు. యావన్ హత్యోదంతంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కీలక ఆధారంగా ఆడియో కాల్ క్లిప్..
కాగా.. నాలుగేళ్లుగా యువతిని ప్రేమిస్తున్న యావన్.. ఏడాదికాలంగా ఆమెకు దూరంగానే ఉంటున్నాడని, ఆమెతో మాట్లాడటం లేదని, అయినా ఇంతటి దారుణానికి ఒడిగట్టడంపై మండిపడుతున్నారు. రెక్కీ చేసి మరీ తల, మెడ సహా 17 చోట్ల పొడిచి చంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో టీవీ చూస్తున్న యావన్ పై గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు దాడి చేశారని, ఇంటిలో నుంచి బయటకు వెళ్లగా.. రోడ్డుపైనే పొడిచి పొడిచి చంపారని వాపోయారు. నిందితుల్లో ఒకరైన సాయియాదవ్.. యావన్ ను హతమార్చిన తర్వాత స్నాప్ చాట్ లో సెల్ఫీ స్టేటస్ పెట్టాడని తెలిపారు. మరోవైపు.. తన కుటుంబ సభ్యులు యావన్ పై దాడికి ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల యువతి కాల్ చేసి చెప్పిన ఆడియో బయటికి వచ్చింది. అతను నిన్ను టార్చర్ చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతాం.. సైన్ పెట్టు అని చెప్పారని, అటాక్ కు ప్లాన్ చేస్తున్నారని తెలిపింది. ఇదంతా తన బావ ప్లాన్ అని కూడా చెప్పింది. బయటికి వచ్చిన ఈ ఆడియో క్లిప్పే కేసులో కీలక ఆధారం కానుంది. యువతి పోలీసుల ముందుకు వచ్చి నిజం చెప్పాలని యావన్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు.






