- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ స్కూలా? నా స్కూలా?... ఇది మన స్కూల్
సరస్వతి శిశు మందిర్ విద్యార్థులతో కేంద్రమంత్రి భావోద్వేగ ప్రసంగం.

దిశ, వెబ్ డెస్క్ : సరస్వతి శిశు మందిర్ తో (Saraswathi Sishu Mandir) తనకున్న అనుబంధాన్ని చెబుతూ కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. సరస్వతి శిశు మందిర్ మీ స్కూలా? నా స్కూలా?... ఇది మన స్కూల్ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ లోని (Karimnagar) హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న సరస్వతి శిశు మందిర్ లో ఖేల్ ఖుద్ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన కేంద్రమంత్రి ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిశు మందిర్ అంటే ఒక బిల్డింగ్ గురించి కాదు.. హంగూ ఆర్భాటం అంతకంటే కాదు అన్నారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న కర్మాగారం అన్నారు. మానవీయ విలువలను విద్యార్థుల్లో పెంపొందిస్తూ దేశ భవిష్యత్తు కోసం నవతరాన్ని ఎటువంటి క్రెడిట్ ఆశించకుండా మౌనంగా తయారు చేస్తున్న దేవాలయం అన్నారు. శిశుమందిర్ లో చదువుకోవడం నిజంగా తమ అదృష్టమని తెలిపారు.
శిశు మందిర్ విద్యార్థినే..
తాను కూడా హౌజింగ్ బోర్డు కాలనీలోని శిశు మందిర్ లోనే చదువుకున్నాను.. ఇక్కడి విద్యార్థినేనని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పిల్లలకు రామాయణం, మహా భారతం గొప్పతనాన్ని, అందులోని విలువలను నేర్పుతారన్నారు. గీతా సారాన్ని అర్ధమయ్యేలా చెబుతారన్నారు. అదే సమయంలో మ్యాథ్స్, సైన్స్, టెక్నాలజీ విద్యను బోధిస్తారన్నారు. అందుకే సంస్కారం, సైన్స్, స్పోర్ట్స్ కలగలిస్తే శిశుమందిర్ విద్య అవుతుందని స్పష్టం చేశారు. ఇంత గొప్ప స్కూల్ లో చదువుకోవడం తనకు గర్వంగా ఉందన్నారు. సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి, ధర్మం వంటి అంశాలు శిశు మందిర్ లోనే నేర్చుకున్నానని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలన్నింటికీ పక్కా భవనాలు నిర్మించడంతోపాటు ల్యాప్ టాప్ సహా ఇతర సౌకర్యాలన్నీ కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విద్యకు అర్థం మార్చేశాయి
కార్పొరేట్ విద్యా సంస్థలు (Corporate Education Institutions) వచ్చాక విద్య అనే మాటకు అర్థం మార్చేశాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ధ్వజమెత్తారు. చదువంటే ర్యాంకులు, మార్కులు, ప్యాకేజీలు ఫారిన్ చదువులు అన్నట్లుగా వ్యవస్థను మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కులు మనిషిని తయారు చేస్తాయా? ర్యాంకులు విలువలను నేర్పుతాయా? ప్యాకేజీలు దేశభక్తిని పెంచుతాయా? అసలు మన భారతదేశానికి ఎట్లాంటి విద్య కావాలి? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మార్కులు, ర్యాంకులే కాదు దేశభక్తిని, సంపూర్ణ మనిషిని నిర్మించే విద్య కావాలని స్పష్టం చేశారు. అది సరస్వతి శిశుమందిర్ లోనే దొరుకుతుందని ఖరాఖండిగా చెప్పారు.
భవిష్యత్తును భుజాల మీద వేసుకున్నారు
సరస్వతి శిశుమందిర్ లో గురువు అంటే జీతం చూసే ఉద్యోగి కాదన్నారు. టైమ్ చూసే క్లర్క్ కూడా కాదని.. ఆయనకొ ఒక సాధకుడని కొనియాడారు. వీళ్లకు పెద్ద జీతాలు లేకపోయినా.. పెద్ద పెద్ద వ్యాపార ప్రకటనలు ఉండకపోయినా కానీ పెద్ద బాధ్యత ఉందిన్నారు. దేశ భవిష్యత్తు భుజాల మీద వేసుకుని దేశాన్ని నిర్మించే అసలైన శిల్పులు శిశుమందిర్ గురువులని చెప్పారు.
విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు
రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు (Congress Government) విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు. విద్యార్థులకు ఇస్తామని 5 లక్షల భరోసా కార్డు పత్తా లేకుండా పోయిందన్నారు. రూ.10 వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలను అవస్థలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 18 ఏళ్లు నిండిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పదో తరగతి పాసైతే రూ.10వేలు, ఇంటర్ పాసైతే 15 వేలు, డిగ్రీ చేస్తే 25 వేలు, పీజీ చేస్తే లక్ష రూపాయలు ఇస్తామన్న మాటలు నీటి మూటలుగా మిగిలాయన్నారు. ఆఖరికి తమ జీవితం మొత్తాన్ని స్కూల్ కు, ప్రభుత్వానికి అంకితం చేసిన రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఇవ్వాలని అడిగిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More..
దయచేసి ‘మన ఊరు-మన బడి’ బిల్లులు చెల్లించండి.. మండలిలో చైర్మన్ గుత్తా షాకింగ్ కామెంట్స్






