- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WakjAbout : వృద్ధాప్యంలో కొత్త ఫ్రెండ్స్.. సరికొత్త ప్రయాణాలతో చిల్లింగ్
రిటైర్మెంట్ తర్వాత కృష్ణా.. రామా.. అంటూ కూర్చోవాల్సిందే అనుకుంటారు. కారణం ఇప్పటికే ఇండియాలో ఏ వయసులో ఏం చేయాలో అది చేస్తేనే బాగుంటుందనే పరిమితులు సెట్ చేసి ఉన్నాయి. కానీ ఇప్పుడు రిటర్మెంట్ తర్వాతి జీవితాన్ని కూడా మరింత అర్థవంతంగా జీవించొచ్చు.

దిశ, ఫీచర్స్ : రిటైర్మెంట్ తర్వాత కృష్ణా.. రామా.. అంటూ కూర్చోవాల్సిందే అనుకుంటారు. కారణం ఇప్పటికే ఇండియాలో ఏ వయసులో ఏం చేయాలో అది చేస్తేనే బాగుంటుందనే పరిమితులు సెట్ చేసి ఉన్నాయి. కానీ ఇప్పుడు రిటర్మెంట్ తర్వాతి జీవితాన్ని కూడా మరింత అర్థవంతంగా.. మరింత కొత్తగా మళ్లీ జీవించేలా చేయొచ్చని.. ‘వాక్‌అబౌట్’ కమ్యూనిటీ చేసి చూపించింది.
ముంబైకి చెందిన రౌవీనా(68) కార్పోరేట్ ఉద్యోగం చేసింది. కానీ కుటుంబ సంక్షేమం కోసం తనకు నచ్చిన డ్యాన్స్, సంగీతం లాంటివి చేయకుండానే రిటైర్మెంట్ ఏజ్‌కు వచ్చింది. ఉన్న ఒక్క జీవితంలో తనను తాను కోల్పోయానన్న భావన తనలో ఎప్పుడూ ఉండేది. అయితే కొవిడ్ టైంలో ‘వాక్అబౌట్’ ప్లాట్ ఫామ్ గురించి చూసి.. అందులో జాయిన్ అయింది. తనకు నచ్చిన డ్యాన్స్, మ్యూజిక్ క్లాసులు, ఈవెంట్లతోపాటు తన ఏజ్ గ్రూప్ వారితో దుబాయ్, కేరళ, గోవా ప్రయాణాలు చేసి సరికొత్త స్నేహాలను పొందింది. ఆత్మవిశ్వాసం, కొత్త లక్ష్యాన్ని కనుగొంది.
వాట్.. వాక్‌అబౌట్
‘వాక్‌అబౌట్’ అనేది 55 ఏళ్లు పైబడిన వారికి కోసం రూపొందించిన కమ్యూనిటీ-డ్రివెన్ ప్లాట్‌ఫామ్. రిటైర్మెంట్‌లో ఇంటికే పరిమితం కాకుండా వృద్ధులు కొత్త ఆసక్తులు, స్నేహాలు, అనుభవాలు పొందేలా ఎంకరేజ్ చేస్తుంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పూణే, చెన్నైలలో లక్షకు పైగా సీనియర్ సిటిజన్లు ఇందులో భాగం కాగా యోగా, డ్యాన్స్, పికిల్‌బాల్, ట్రావెల్ వంటివి చేస్తున్నారు.
ఎలా మొదలైంది?
ఫౌండర్ దేవల్ దేళీవాలా విదేశాల్లో ఏజింగ్ గురించి చూసి ఈ ఆలోచనకు వచ్చారు. అమెరికాలో 70 ఏళ్ల వారు కూడా డ్రైవ్ చేసి, ప్రయాణాలు చేసి, కొత్త హాబీలు నేర్చుకుంటున్నారు. కానీ భారత్‌లో సమాజం వృద్ధాప్యాన్ని పరిమితులతో గీత దాటనివ్వని పరిస్థితుల్లో ఉంచిందని గుర్తించారు. కో-ఫౌండర్ అశ్విని కపిలా 28 సంవత్సరాల బ్యాంకింగ్ కెరీర్ తర్వాత ఇలాంటి అర్థవంతమైన పని చేయాలని నిర్ణయించుకున్నారు. రిటైర్‌మెంట్‌ను ముగింపుగా కాకుండా.. కొత్త అధ్యాయంగా చూడాలనేది వారి లక్ష్యం. ఇలా 2025 జనవరిలో GetSetUp Indiaగా స్టార్ట్ చేసిన ఈ ప్లాట్ ఫామ్ ‘వాక్‌అబౌట్’గా రీబ్రాండ్ అయింది. ప్రస్తుతం భారతదేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా సభ్యులు ఉన్నారు. 100+ ఆఫ్‌లైన్ ఈవెంట్లు, 1000+ డిజిటల్ అనుభవాలు పొందుతున్నారు.
చాలా మంది వృద్ధులు కుటుంబంతో ప్రయాణం చేసినా.. తమ సొంత కుటుంబ సభ్యుల బాగోగుల గురించి ఆలోచిస్తూ తమకేం కావాలో గుర్తించరు. గుర్తించినా త్యాగం చేస్తరు. అందుకే తన ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్‌తో ట్రావెల్ చేసేటప్పుడు.. సరికొత్తగా జీవిస్తారని నమ్మారు ఫౌండర్స్. అంతేకాదు రిటైర్‌మెంట్ తర్వాత సమయం ఉన్నా ఏం చేయాలో తెలియని కొందరు.. ‘వాక్‌అబౌట్’ ద్వారా వెల్‌నెస్, పికిల్‌బాల్, సోషల్ మీటప్‌లు చేస్తూ కొత్తగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పడం ఈ ప్లాట్ ఫామ్ సక్సెస్‌కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకొందరు అయితే తమ పార్ట్‌నర్స్‌తో ‘మళ్లీ డేటింగ్ చేస్తున్నట్టు ఉంది’ అని హ్యాపీగా చెప్తున్నారు.
ప్రభావం
భారత్‌లో ‘సిల్వర్ డివిడెండ్’ అంటే ఆరోగ్యవంతులైన, చురుకైన వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. కానీ సమాజం వారిని పరిమితుల్లో బంధించేస్తుంది. వాక్‌అబౌట్ దీన్ని మార్చాలని భావిస్తోంది. సీనియర్లు కూడా నేర్చుకోవాలి, ప్రయాణం చేయాలి, సహకరించాలని చెబుతోంది. వృద్ధాప్యం అంటే ఒంటరితనం కాదు. కమ్యూనిటీ, క్యూరియాసిటీ, కనెక్షన్ ద్వారా జీవితంలో మళ్లీ రంగులు నింపుకోవచ్చనే సందేశాన్నిస్తోంది. ఇక ఇందులో ఈవెంట్లు సుమారు ₹500 నుంచి మొదలవుతాయి. ట్రిప్పులు ₹35,000 పైన ఉంటాయి.






