ప్రభుత్వ బడిని బతికిస్తే బైండోవర్ కేసులా..?

by Ratna Kumari |

మేము చేసిన తప్పల్లా.. సర్కార్ బడిని నమ్ముకున్న పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమేనా..

ప్రభుత్వ బడిని బతికిస్తే బైండోవర్ కేసులా..?
X

దిశ,​తాడ్వాయి : మేము చేసిన తప్పల్లా.. సర్కార్ బడిని నమ్ముకున్న పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమేనా..ప్రభుత్వ పాఠశాలను బాగుచేస్తే ఒకరిద్దరు గిట్టక పిర్యాదు చేస్తే మాపై పోలీసులు బైండోవర్ కేసులు పెట్టి వేధిస్తారా... అంటూ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ బడిని ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దినందుకు ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రస్తుతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.​ఈ నేపథ్యంలో బుధవారం మండల కేంద్రంలోని సర్పంచ్ రవీందర్ రెడ్డి,ఉపసర్పంచ్ మహేందర్,పాలకవర్గం,గ్రామస్తులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ గోడును వెళ్లగక్కారు.

సర్కార్ బడి ప్రగతి ప్రస్థానం ఇలా..

​గ్రామంలో ప్రైవేట్ పాఠశాలల మోజును తగ్గించి,ప్రభుత్వ బడిలోనే అన్ని అర్హతలు ఉన్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందాలనే సత్సంకల్పంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాలలో 15 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసి నిరంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏ విధంగా విద్యార్థులను తీర్చిద్దుతున్నారో అని పర్యవేక్షించే విధంగా సర్పంచ్ రవీందర్ రెడ్డి గ్రామస్తుల సహకారంతో నడుం బిగించారు.ఆయన ప్రత్యేక కృషితో గతంలో పాఠశాలలో కేవలం 108 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య,ఈ విద్యా సంవత్సరానికి ఏకంగా 300కు పైగా చేరుకుంది.ప్రభుత్వ బడి సాధించిన ఈ అద్భుత ప్రగతిని స్వయంగా రాష్ట్ర స్థాయి డీఎస్ఈ కమిషనర్ నవీన్ నికోలస్ గుర్తించి,తన కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా ఉత్తమ పాఠశాలగా సర్టిఫికెట్ ఇచ్చి ఉపాధ్యాయులను, అభినందించారంటే మా కృషి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.

​ప్రైవేట్ యాజమాన్యాల కుట్ర..

​అయితే,ప్రభుత్వ బడికి విద్యార్థులు వెళ్లడంతో ప్రైవేట్ పాఠశాలల వ్యాపారం 50 లక్షలకు పైగా దెబ్బతిందని, అందుకే కొందరు ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మక్కై తమపై జిల్లా కలెక్టర్,ఎస్పీని తప్పుదోవ పట్టించేలా ఫిర్యాదులు చేశారని సర్పంచ్ తీవ్రంగా ఆరోపించారు.ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను తామెప్పుడూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు విద్యార్థులను చేర్పిస్తున్నప్పుడు మేమెందుకు అడ్డుకుంటామని ఆయన అన్నారు.2000 పైచిలుకు జనాభా ఉన్న గ్రామంలో ముక్తకంఠంగా ఏకగ్రీవ తీర్మానం సైతం చేసామని ఆయన వెల్లడించారు.అంతేకాకుండా,కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులే ప్రైవేట్ స్కూళ్లకు తొత్తులుగా మారుతున్నారని ఆయన మండిపడ్డారు. ​ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని చూస్తే తమపై కక్ష కట్టి బైండోవర్ కేసులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా సంక్షేమం కోసం పనిచేసే తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు.గ్రామంలో ఎలాంటి విచారణ జరపకుండా,నేరుగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు.అయినప్పటికీ చట్టాన్ని గౌరవించి పోలీసులకు సహకరించామని తెలిపారు.

ప్రభుత్వానికి విజ్ఞప్తి ..

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా ​మంచి పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను సర్పంచ్ కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడితే వేధింపులకు గురిచేస్తున్న అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Next Story