ఆర్టిజన్ కార్మికులకు అన్యాయం చేస్తే ఉద్యమమే.. టీజీఎస్‌పీడీసీఎల్ ఎదుట మహాధర్నా

by Ramesh Naini |

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులకు నష్టం కలిగించేలా ప్రభుత్వం, యాజమాన్యం వ్యవహరిస్తే ఊరుకునేది లేదని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈజేఏసీ) హెచ్చరించింది.

ఆర్టిజన్ కార్మికులకు అన్యాయం చేస్తే ఉద్యమమే.. టీజీఎస్‌పీడీసీఎల్ ఎదుట మహాధర్నా
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులకు నష్టం కలిగించేలా ప్రభుత్వం, యాజమాన్యం వ్యవహరిస్తే ఊరుకునేది లేదని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈజేఏసీ) హెచ్చరించింది. ఆర్టిజన్ కార్మికులకు అడ్జస్టింగ్ (ఏపీఎస్ఈబీ) సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట మాస్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన సుమారు 23,600 మంది కాంట్రాక్టు కార్మికులను ఆర్టిజన్స్‌గా గుర్తించి బేసిక్ కేటాయించినప్పటికీ, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్‌కు బదులుగా 1947 నాటి ఐడీ యాక్ట్ స్టాండింగ్ ఆర్డర్స్ అమలు చేసి మోసం చేశారని మండిపడ్డారు.

దీనికి నిరసనగా గతంలో జరిపిన సమ్మె సమయాన, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 17న సమ్మె విరమించామని గుర్తుచేశారు. కానీ తమకు అన్యాయమే జరుగుతోందని, ఉన్నతాధికారులను కలిసినా సరైన సమాధానం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆర్టిజన్ల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని దుయ్యబట్టారు. ఆర్టిజన్ కార్మికులకు తక్షణమే ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని, నిరసనలపై ప్రభుత్వం స్పందించక పోతే భవిష్యత్తులో సమ్మెకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, టీవీఏఈజేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి, కో చైర్మన్ శ్రీధర్ గౌడ్, కన్వీనర్లు, సాయిలు, చంద్రారెడ్డి, కో-కన్వీనర్ చందర్ సింగ్ ఠాకూర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story