- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో పాల్గొన్న సీఎంసీ కమిషనర్ శ్రీజన, ఎమ్మెల్యే గాంధి
సీఎంసీ పరిధిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సీఎంసీ కమిషనర్ శ్రీజన 'వన్ వార్డ్ ఎవ్రీ డే' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

దిశ, కూకట్‌పల్లి : సీఎంసీ పరిధిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సీఎంసీ కమిషనర్ శ్రీజన 'వన్ వార్డ్ ఎవ్రీ డే' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని ఆల్విన్ కాలనీ, శంషీగూడ డివిజన్‌లకు చెందిన కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, కాలనీ వాసులతో బుధవారం ఆల్విన్ కాలనీ ఫేజ్-1లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ కమిషనర్ శ్రీజన, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధి, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, జలమండలి, సీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు డివిజన్‌ల కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు తమ తమ కాలనీల్లోని సమస్యలను కమిషనర్ శ్రీజన, ఎమ్మెల్యే గాంధి, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్‌ల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధి మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి వంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. అలాగే పార్కులను అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో సుందర శోభిత వనాలుగా తీర్చిదిద్దుతామని, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పార్కుల్లో పిల్లలు, వృద్ధులు సేదతీరేందుకు అనువుగా అన్ని రకాల వసతులు కల్పిస్తామని, కాలనీల్లో ప్రజలకు చక్కటి, ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని అన్నారు. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గాంధి సీఎంసీ కమిషనర్ శ్రీజనను కోరారు. పెండింగ్‌లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని, సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని, నాలాల్లో నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, ఆల్విన్ కాలనీ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధి అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఎస్‌ఈ చలసాని శ్రీకాంతి, జలమండలి జీఎం హరిశంకర్, డీజీఎం శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
అధికారిక కార్యక్రమంలో అందరూ అధికార పార్టీ నాయకులే..
సీఎంసీ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమం 'వన్ వార్డ్ ఎవ్రీ డే'. కాగా, ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాల్సి ఉండగా, మాజీ ప్రజాప్రతినిధులు వేదికపై ఉండటం, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధుల స్థానంలో స్థానిక అధికార పార్టీ నాయకులే ఎక్కువ శాతం కూర్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జలమండలి సమస్యలే ఎక్కువ : డీసీ చాముండేశ్వరి, ఆల్విన్ కాలనీ సర్కిల్
ఆల్విన్ కాలనీ సర్కిల్‌లో నిర్వహించిన 'వన్ వార్డ్ ఎవ్రీ డే' కార్యక్రమంలో ప్రజలతో నిర్వహించిన సమావేశంలో మొత్తం 40 ఫిర్యాదులు వచ్చాయని డీసీ చాముండేశ్వరి తెలిపారు. వాటిలో ఎక్కువగా జలమండలి విభాగానికి సంబంధించిన తాగునీటి సరఫరా, మురుగునీటి సమస్యలే ఉన్నాయని పేర్కొన్నారు. మిగిలిన ఫిర్యాదులు వీధి దీపాలు, చెత్తను సకాలంలో తరలించకపోవడం, పారిశుధ్య సేవలకు సంబంధించినవని తెలిపారు. అందిన ఫిర్యాదుల్లో సింహభాగం జలమండలి విభాగానికి సంబంధించినవేనని వెల్లడించారు.






