గోదావరి పుష్కరాలు–2027కు పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్లాలి

by Ratna Kumari |

రానున్న గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అధికారులను ఆదేశించారు.

గోదావరి పుష్కరాలు–2027కు పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్లాలి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రానున్న గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. పుణ్యస్నానాల కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవలు, ప్రజా సౌకర్యాలపై ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలోని ప్రతి పుష్కర ఘాట్‌కు ప్రత్యేక బందోబస్తు ప్రణాళిక రూపొందించాలని, రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించాలని ఆదేశించారు.

పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, క్యూ లైన్లు, బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులు, దిశానిర్దేశక సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా సంబంధిత శాఖలతో సమన్వయం పెంచాలని తెలిపారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పుష్కర ఘాట్లకు దూరంగా పార్కింగ్ స్థలాలను గుర్తించి, అక్కడి నుంచి షటిల్ వాహనాల ద్వారా భక్తులను తరలించే విధంగా ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిబ్బంది, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కర ఘాట్లు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, రహదారుల్లో ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని, అవసరమైన చోట డ్రోన్ల ద్వారా 24 గంటల పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

అదేవిధంగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయడంతో పాటు తప్పిపోయిన చిన్నారులు, వృద్ధుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఆర్టీసీ, నీటిపారుదల, విపత్తు నిర్వహణ శాఖలతో సమన్వయం పెంచి సంయుక్త కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి పుష్కర ఘాట్ వద్ద తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పుకార్లు, తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు సోషల్ మీడియా పర్యవేక్షణను బలోపేతం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు, గోదావరి పరివాహక ప్రాంత సీఐలు, ఎస్‌ఐలు, ఐటీ కోర్, కమ్యూనికేషన్ విభాగ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story