ప్రభుత్వ ఉద్యోగులు కృత్రిమ మేధస్సును వినియోగించుకోవాలి : ఫైజాన్ అహ్మద్

by Batti.Sumithra |

ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ)ను విధిగా వినియోగించుకోవాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు కృత్రిమ మేధస్సును వినియోగించుకోవాలి : ఫైజాన్ అహ్మద్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ)ను విధిగా వినియోగించుకోవాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) వినియోగం వల్ల పాలనా సామర్థ్యం, పౌర సేవలు గణనీయంగా మెరుగుపడతాయని సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులు, సిబ్బందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. దస్త్రాల నిర్వహణ, నివేదికల తయారీ కృత్రిమ మేధస్సు ద్వారా సులభతరమవుతుందని అన్నారు. సున్నితమైన సమాచార భద్రతను దృష్టిలో ఉంచుకొని పరిమితమైన, నియంత్రిత విధానాలను పాటించడం అత్యవసరమని అదనపు కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

టీ-ఫైబర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఏఐ శిక్షణ కార్యక్రమం కలెక్టరేట్ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గతంలో పనులు ఎలా జరిగాయో అధ్యయనం చేసి, తదుపరి చర్యలను ముందుగానే ఊహించి, తదనుగుణంగా కార్యాలయ ఫైళ్ల నిర్వహణ, ప్రతిరోజూ డ్రాఫ్టింగ్, నోటింగ్, ఫైల్ మూవ్‌మెంట్ వంటి పనులను సులభతరం చేయవచ్చని తెలిపారు. డ్రాఫ్టింగ్‌లో జరిగే వ్యాకరణ దోషాలు, స్పెల్లింగ్ తప్పులను కూడా ఏఐ ద్వారా సరిచేసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లు, పాంప్లెట్లు, ఫ్లెక్సీ బ్యానర్ల రూపకల్పనలో కూడా ఈ టూల్స్ అద్భుతంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అయితే ఏఐ సహకారి మాత్రమేనని, ప్రత్యామ్నాయం మాత్రం కాదని ఫైజాన్ అహ్మద్ సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 'సూపర్ టీచర్' బృందానికి చెందిన వాసుదేవ్, రాజులకు అదనపు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మాలతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story