- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగస్టు మూడో వారానికి చెరువులు సిద్ధం కావాలి: హైడ్రా కమిషనర్ రంగనాథ్
పలు చెరువుల అభివృద్ధి పనులను ఆగస్టు నెల 3వ వారానికి పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు.

దిశ, శేరిలింగంపల్లి: మాధాపూర్, ఐటీ కారిడార్‌లోని తమ్మిడికుంట, సున్నం చెరువు అభివృద్ధి పనులను ఆగస్టు నెల 3వ వారానికి పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. వర్షం నీరు నేరుగా చెరువులోకి చేరేలా ఇన్‌లెట్లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ రెండు చెరువుల పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు చుట్టూ పాత్‌వే నిర్మాణంతో పాటు.. ప్రధాన గేట్ల ఏర్పాటును చూశారు. వరద కట్టడి, భూగర్భ జలాల వృద్ధితో పాటు.. ఒక చెరువు వల్ల సమకూరే ప్రయోజనాలన్నీ ప్రజలకు తెలిసి వచ్చేలా చెరువులను అభివృద్ధి చేయాలన్నారు. కబ్జాలకు గురై 16.4 ఎకరాలకు పరిమితమైన సున్నంచెరువును ఆక్రమణలను తొలగించి 30.5 ఎకరాలకు హైడ్రా విస్తరించిన విషయం విధితమే.
చెరువులోకి మురుగు నీరు చేరకుండా...
తమ్మిడికుంట కూడా 16.2 ఎకరాలకు పరిమితమవ్వగా.. 29.3 ఎకరాలకు విస్తరించి అభివృద్ధి పనులను హైడ్రా చేపడుతోంది. చెరువుల చుట్టూ బలమైన బండ్ ఏర్పాటుతో పాటు.. చుట్టూ విశాలమైన పాత్‌వే నిర్మాణం చేపట్టాలని హైడ్రా కమిషనర్ సూచించారు. చెరువుల చెంత పార్కులు, ఓపెన్ జిమ్‌లు, పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియాలు ఏర్పాటు చేయాలన్నారు. చెరువులోకి వరద నీరు సులభంగా చేరేలా ఇన్‌లెట్లు, చెరువు నిండిన తర్వాత బయటకు వెళ్లేలా ఔట్‌లెట్లు అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు చెంత వరదకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లుండాలన్నారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా ఎస్‌టీపీల నిర్మాణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు. చెరువు పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ఆగస్టు మూడో వారానికి ఈ రెండు చెరువుల ప్రారంభానికి సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు. హైడ్రా అసెట్ ప్రొటెక్షన్ విభాగం అడిషనల్ కమిషనర్ డి. ఆనంద్‌కుమార్, ఏసీపీ తిరుమల్, చెరువు పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాట్స్ యజమాని యూనస్‌తో పాటు పలువురు అధికారులు హైడ్రా కమిషనర్ వెంట ఉన్నారు.






