- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పథకాలు-బడ్జెట్ కేటాయింపులు-విధానాలపై సమీక్ష అవసరం
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ‘నేషనల్ హ్యాండ్లూమ్ డే: ఎ డికేడ్ ఆఫ్ రిఫ్లెక్షన్ – రివ్యూయింగ్ ది జర్నీ, షేపింగ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై ప్రత్యేక సమీక్షా కార్యక్రమం నిర్వహించారు.

దిశ, ఖైరతాబాద్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ‘నేషనల్ హ్యాండ్లూమ్ డే: ఎ డికేడ్ ఆఫ్ రిఫ్లెక్షన్ – రివ్యూయింగ్ ది జర్నీ, షేపింగ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై ప్రత్యేక సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. చేనేత రంగంలో గత దశాబ్ద కాలంలో చోటుచేసుకున్న మార్పులు, చేనేత కార్మికుల ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలు, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు, చేనేత ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా చేనేత విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు వెంకన్న నేత మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి దాదాపు దశాబ్ద కాలం పూర్తయిందన్నారు. ఈ కాలంలో చేనేత రంగం, కళాకారుల జీవితాల్లో వచ్చిన మార్పులను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటికీ 67 శాతం మంది చేనేత కళాకారులు నెలకు రూ.5 వేల లోపు ఆదాయంతో జీవిస్తున్నారని, 27 శాతం మంది రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు సంపాదిస్తున్నారని తెలిపారు. కేవలం 3 శాతం మంది మాత్రమే రూ.20 వేలకుపైగా ఆదాయం పొందుతున్నారని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం ప్రారంభమైన తర్వాత కూడా చేనేత కళాకారుల ఆర్థిక పరిస్థితిలో ఆశించిన స్థాయిలో మార్పు ఎందుకు రాలేదనే అంశంపై ప్రభుత్వాలు సమగ్రంగా అధ్యయనం చేయాలని వెంకన్న నేత కోరారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగంపై మరింత సుదీర్ఘంగా చర్చించి, విధానాలు, బడ్జెట్ కేటాయింపులు, సంక్షేమ పథకాల్లో అవసరమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. చేనేత దినోత్సవం ద్వారా లభించే ప్రయోజనాలు ప్రతి చేనేత కళాకారుడికి చేరేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు..తెలంగాణలో సుమారు 20 వేల చేనేత మగ్గాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 40 వేల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ సహాయం, సబ్సిడీలు, పలు పథకాల అమలులో నిలిపివేతలు చోటుచేసుకోవడంతో చేనేత కళాకారులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చేనేత రంగాన్ని ఆదుకోవాలని కోరారు. పద్మశ్రీ చింతకింది మల్లేశం మాట్లాడుతూ.. తెలంగాణలో చేనేత రంగాన్ని, చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త, ఆధునిక పథకాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత ఉత్పత్తులకు సమర్థవంతమైన మార్కెటింగ్, విస్తృత ప్రచారం కల్పిస్తే అమ్మకాలు పెరుగుతాయని తెలిపారు.
కొత్త డిజైన్లు రూపొందించేందుకు...
ఉత్పత్తులకు ఆదరణ పెరిగితే చేనేత కార్మికులకు ఏడాది పొడవునా నిరంతర ఉపాధి లభిస్తుందని, తద్వారా వారు ఆర్థికంగా స్థిరపడటంతో పాటు తమ పిల్లలను కూడా చేనేత వృత్తిలోకి తీసుకురాగలరని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మహిళలకు చేనేత రంగంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 40 ఏళ్లలోపు మహిళలను ఎంపిక చేసి పోచంపల్లి ఇక్కత్ డిజైన్లు, ఫ్రీ లూమ్, డైయింగ్, మార్కింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. శిక్షణ సమయంలో స్టైఫండ్ అందించడంతో పాటు, సొంతంగా మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు, కొత్త డిజైన్లు రూపొందించేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 10 బ్యాచ్‌లలో మహిళలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో పురుషులకు మాత్రమే పరిమితమైన మగ్గం నేత వృత్తిలోకి ఇప్పుడు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ప్రవేశిస్తున్నారని, జనగామ ప్రాంతంలో మహిళలు చేనేత రంగంలో ఉపాధి పొందుతూ పురుషులతో సమానంగా ఆదాయం సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మార్పు మరింత మంది మహిళలు, యువత చేనేతను ఉపాధి మార్గంగా ఎంచుకునేందుకు స్ఫూర్తినిస్తోందన్నారు.
చేనేతకు ప్రాధాన్యత ఇవ్వాలి: పూనం కౌర్
సినీనటి పూనం కౌర్ మాట్లాడుతూ.. చేనేత అనేది కేవలం ఒక వస్త్రం కాదని, అది భారతదేశ సంస్కృతి, వారసత్వం, జాతీయ గర్వానికి ప్రతీక అని అన్నారు. అసలైన చేనేత, ఖాదీకి సమాజంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పవర్‌లూమ్, మిక్స్‌డ్ లూమ్ ఉత్పత్తులను చేనేత పేరుతో విక్రయించడాన్ని అరికట్టాలని కోరారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పాలియెస్టర్ జెండాలు, వస్త్రాల వినియోగం తగ్గించి చేనేత కళాకారులు, ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించాలని ప్రభుత్వాలను కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి మన పూర్వీకుల వారసత్వాన్ని, చేనేత వృత్తిని కాపాడాల్సిన బాధ్యత ఉందని పూనం కౌర్ పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం, ప్రజలు, పరిశ్రమలు సమిష్టిగా కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వక్తలు మాజీ ఐఏఎస్లు చిరంజీవిలు, నరేష్, పద్మశ్రీ గజం గోవర్ధన్ పాల్గొని అభిప్రాయాలను తెలిపారు.






