దేశంలోనే తొలిసారిగా ‘ఎలక్ట్రిసిటీ ఆంబ్యులెన్స్’.. 1912 హెల్ప్‌లైన్‌కు కృత్రిమ మేధ (ఏఐ)

by Batti.Sumithra |

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎన్పీడీసీఎల్ హన్మకొండ ప్రధాన కార్యాలయంలో విద్యుత్‌పై సమీక్ష నిర్వహించిన అనంతరం వరంగల్ జిల్లా వ్యాప్తంగా రూ.56 కోట్లతో వివిధ విద్యుత్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

దేశంలోనే తొలిసారిగా ‘ఎలక్ట్రిసిటీ ఆంబ్యులెన్స్’.. 1912 హెల్ప్‌లైన్‌కు కృత్రిమ మేధ (ఏఐ)
X

దిశ, హన్మకొండ టౌన్ : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎన్పీడీసీఎల్ హన్మకొండ ప్రధాన కార్యాలయంలో విద్యుత్‌పై సమీక్ష నిర్వహించిన అనంతరం వరంగల్ జిల్లా వ్యాప్తంగా రూ.56 కోట్లతో వివిధ విద్యుత్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విద్యుత్ రంగంలో మౌలిక వసతుల విస్తరణకు శ్రీకారం చుట్టినట్లు సమీక్ష సమావేశంలో ఆయన తెలిపారు. ఎల్‌నినో ప్రతికూల వాతావరణ ప్రభావంతో వర్షాకాలంలోనూ వేసవిని తలపించిన విద్యుత్ డిమాండ్, పడిపోయిన జలవిద్యుత్ ఉత్పత్తితో ఒకేసారి పడిన 7,000 మెగావాట్ల అదనపు భారాన్ని తెలంగాణ విద్యుత్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా తట్టుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి వెల్లడించారు. టీజీఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ‘విద్యుత్ భవన్’, నక్కలగుట్ట, హన్మకొండలో వాజ్‌పేయి కాలనీ, ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్, విద్యుత్ నగర్, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు, హనుమకొండ నూతన సర్కిల్ కార్యాలయ భవనానికి, అలాగే టీజీఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఐదో అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అత్యవసర సేవల కోసం 58 ప్రత్యేక ఎమర్జెన్సీ వాహనాలు, 230 ఇతర వాహనాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. విద్యుత్ వ్యవస్థకు మూలస్తంభాలైన లైన్‌మెన్లు, ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని ఉద్ఘాటిస్తూ, విధి నిర్వహణలో అనుకోకుండా ప్రమాదం జరిగి సిబ్బంది మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు రూ.1.20 కోట్ల బీమా సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. అలాగే లైన్ క్లియరెన్స్ సమయంలో ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన సేఫ్టీ కిట్లు, యూనిఫారాలు అందించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ‘గృహజ్యోతి’ పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్న 53 లక్షల కుటుంబాల బిల్లుల మొత్తాన్ని ఆర్థిక శాఖ డిస్కం కంపెనీలకు చెల్లిస్తోందని తెలిపారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని కాళేశ్వరం, దేవాదుల, సీతారామ వంటి బృహత్తర ఎత్తిపోతల పథకాలతో పాటు వర్షాభావంతో రైతులు బోర్‌వెల్స్‌ను ఎక్కువగా వినియోగించడం వల్ల పెరిగిన విద్యుత్ అవసరాలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందన్నారు. రాష్ట్రంలో 'పవర్ కట్' అనేదే లేదని, వర్షాలు, ఈదురు గాలులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల స్తంభాలు, లైన్లపై చెట్లు కూలినప్పుడు మాత్రమే తాత్కాలికంగా విద్యుత్ అంతరాయం కలుగుతుందని, దీనిని ప్రజలు పవర్ కట్‌గా భావించవద్దని స్పష్టం చేశారు.

దేశంలోనే ప్రథమంగా ఎలక్ట్రిసిటీ ఆంబ్యులెన్స్ సేవలు..

విద్యుత్ సేవా ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు దేశంలోనే ప్రథమంగా తెలంగాణలో ఎలక్ట్రిసిటీ ఆంబ్యులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. గతంలో వైద్యారోగ్య శాఖలో 108 ఆంబ్యులెన్స్ సేవలు తీసుకొచ్చిన తరహాలోనే, ఇప్పుడు విద్యుత్ అత్యవసర సమస్యల కోసం ట్రాన్స్‌ఫార్మర్లు, నిచ్చెనలు, వైర్లతో పాటు నిపుణులైన ఇంజనీర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా ఈ వాహనాలను రంగంలోకి దించామన్నారు. వినియోగదారులు ఉచిత టోల్‌ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయగానే, కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికత ద్వారా సమాచారాన్ని స్వీకరించి, ఆటోమేటిక్‌గా క్షణాల్లో సమాచారాన్ని ఆంబ్యులెన్స్ సిబ్బందికి చేరవేస్తుందని తెలిపారు.

సందేశం ఆధారంగా ఆంబ్యులెన్స్ తరహాలో నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలికి చేరుకుని సమస్యను తక్షణమే పరిష్కరిస్తుందని వివరించారు. ఆర్థిక సంస్కరణల ద్వారా వడ్డీ రేట్ల పునఃచర్చల ఫలితంగా సంవత్సరానికి రూ.134.30 కోట్ల ఆదా సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న, జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) నిఖిల్, టీజీఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story