- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ హరిత
విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరించారు.

దిశ, ఆసిఫాబాద్ : విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరించారు. గురువారం ఆసిఫాబాద్ మండలంలోని మోవాడ్ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించగా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ, మందుల స్టాక్ రిజిస్టర్లు ఖాళీగా ఉండడం, మందుల వివరాలు నమోదు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే గత పది రోజులుగా సిబ్బంది హాజరు నమోదు కాకపోవడంతో సంబంధిత సిబ్బందికి గైర్హాజరు వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సిబ్బంది తమ పనితీరును మార్చుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. 58 మంది విద్యార్థులకు గాను 10 మంది ఉపాధ్యాయులు ఉండడాన్ని గమనించి, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి జిల్లాస్థాయి ఆహార భద్రత విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చౌకధరల దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలకు ప్రతి నెల 3,205 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతుందని, ఆ బియ్యం పక్కదారి పట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.






