సమీకృత మండల కార్యాలయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి

by Ratna Kumari |

ప్రజలకు ఒకే ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ శాఖల సేవలు అందేలా సకల సౌకర్యాలతో సమీకృత మండల కార్యాలయ సముదాయ భవనాలను నిర్మించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు.

సమీకృత మండల కార్యాలయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
X

దిశ, సత్తుపల్లి : ప్రజలకు ఒకే ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ శాఖల సేవలు అందేలా సకల సౌకర్యాలతో సమీకృత మండల కార్యాలయ సముదాయ భవనాలను నిర్మించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి నూతనంగా నిర్మించనున్న సమీకృత మండల కార్యాలయ సముదాయం నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణ మ్యాప్‌లను పరిశీలించిన కలెక్టర్ ఆర్ అండ్ బీ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండల ప్రజల సౌకర్యార్థం రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్, విద్యాశాఖ, శిశు సంక్షేమం, రిజిస్ట్రేషన్, రోడ్లు-భవనాలు, నీటిపారుదల, మిషన్ భగీరథ తదితర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో పనిచేసేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. దీంతో ప్రజలు ఒక పని కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని తెలిపారు. అంతస్తుల వారీగా కార్యాలయాల ఏర్పాటు, విశాలమైన కాన్ఫరెన్స్ హాల్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సమావేశ మందిరాలు, ఆధునిక కార్యాలయ గదులు, ప్రజల కోసం వేచిచూడే హాల్స్, పార్కింగ్, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, దివ్యాంగులకు అనుకూల ర్యాంపులు, లిఫ్ట్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

అలాగే కార్యాలయ సముదాయంలో అంతర్గత రహదారులు, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, సోలార్ విద్యుత్ వ్యవస్థ, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కనెక్షన్, ప్రతి అంతస్తులో వెయిటింగ్ ఏరియా, తాగునీటి ట్యాప్‌లు, ఫైళ్ల భద్రపరిచేందుకు ప్రత్యేక స్టోరేజ్ గదులు ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సమీకృత కార్యాలయ సముదాయం పూర్తయితే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెరిగి, ఫైళ్ల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు మరింత చేరువ అవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్‌ఈ యుగేందర్‌రావు, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, డీఈ భగవాన్, ఏఈ కోటేశ్వరరావు, పీఆర్ డీఈ రాంబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.

Next Story