మద్యం మత్తులో కారు డ్రైవర్ బీభత్సం..

by Taduka Kalyani |

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట స్టేజి సమీపంలోని కల్వర్టు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

మద్యం మత్తులో కారు డ్రైవర్ బీభత్సం..
X

దిశ,బెజ్జంకి : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట స్టేజి సమీపంలోని కల్వర్టు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తిరుపతి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. దాచారం గ్రామానికి చెందిన కనగండ్ల పోషయ్య టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోటార్ సైకిల్‌పై బెజ్జంకి నుంచి దాచారం వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన మారుతి ఎర్టిగా కారు (ఏపీ 07 డీకే 0796) అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. కారును పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం 8 ఇంక్లైన్ కాలనీకి చెందిన రామగిరి అగ్ని (27) నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రమాదంలో పోషయ్యకు తల, నడుము, కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం అదుపు తప్పిన కారు ముందుకు వెళ్లి బజాజ్ ఆటో (టీజీ 36టీ 2949)ను కూడా ఢీకొట్టింది. ఆటో డ్రైవర్ గంగుల ఐలయ్యకు కుడి చేయి, కుడి తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాచారం గ్రామానికి చెందిన కనగండ్ల తిరుపతి (37) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు బెజ్జంకి ఎస్సై తిరుపతి తెలిపారు.

Next Story