నల్లమలలోని వంకేశ్వరం యువకుడి అరుదైన ఘనత

by Batti.Sumithra |

నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన చెరుకుపల్లి వెంకటయ్య కుమారుడు డాక్టర్ శివప్రసాద్ చెరుకుపల్లి జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యా ప్రతిభను కనబరిచి గ్రామానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.

నల్లమలలోని వంకేశ్వరం యువకుడి అరుదైన ఘనత
X

దిశ, అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన చెరుకుపల్లి వెంకటయ్య కుమారుడు డాక్టర్ శివప్రసాద్ చెరుకుపల్లి జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యా ప్రతిభను కనబరిచి గ్రామానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. దేశంలోని అత్యున్నత విద్యాసంస్థ అయిన ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) నుంచి ఆయన పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఇప్పటివరకు 8 అంతర్జాతీయ జర్నల్ ఆర్టికల్స్, ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్, ఒక బుక్ చాప్టర్ ప్రచురించారు. ఆయన పరిశోధనలకు గాను రెండు పేటెంట్లు (Patents), ఒక డిజైన్ రిజిస్ట్రేషన్ మంజూరయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాత నార్త్ అమెరికన్ మానుఫాక్చరింగ్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ (NAMRC) లో పలుమార్లు తన పరిశోధనలను సమర్పించి అంతర్జాతీయ గుర్తింపు పొందారు.

అంతర్జాతీయ అనుభవం

2019లో నార్వేలోని ప్రఖ్యాత NTNU యూనివర్సిటీలో 'సస్టైనబుల్ అండ్ సర్క్యులర్ మానుఫాక్చరింగ్' సమ్మర్ స్కూల్‌లో పాల్గొన్నారు. 2023లో జపాన్‌లోని వాసెడా (Waseda) యూనివర్సిటీ, టోక్యోలో నిర్వహించిన స్ప్రింగ్ స్కూల్‌కు హాజరయ్యారు. 2025 ఆగస్టు నుంచి నవంబర్ వరకు జపాన్‌లోని ప్రతిష్ఠాత్మక AISTలో JST LOTUS ప్రోగ్రామ్ కింద విజిటింగ్ రీసెర్చ్ ఫెలోగా ఎంపికై, అంతర్జాతీయ పరిశోధకులతో కలిసి పనిచేశారు. తన ఉన్నత విద్యకు, పరిశోధనలకు అన్ని విధాలా సహకరించిన తన గైడ్ (పర్యవేక్షకులు), తన ఎదుగుదల కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆర్థిక సహాయం అందించిన భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు, రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు అందించిన ఐఐటీ హైదరాబాద్‌కు, అలాగే జపాన్, నార్వే విశ్వవిద్యాలయాలకు, సహకరించిన మిత్రులకు, తోటి పరిశోధకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మారుమూల గ్రామానికి చెందిన యువకుడు డాక్టర్ శివప్రసాద్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అరుదైన విజయాలు సాధించడం పట్ల వంకేశ్వరం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, విద్యావంతులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story