దేవ్‌జీ రాక‌తో మా ప్రపంచం తిరిగి వచ్చినట్టే.. తమ్ముడి కూతురు సుమ భావోద్వేగ వీడియో వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-22 08:59:12  IST  )

మావోయిస్టు నేత దేవ్‌జీ లొంగుబాటు వార్తలపై ఆయన తమ్ముడి కుతురు సుమ తిపిరి భావోద్వేగ వీడియోతో పాటు ఓ లేఖను విడుదల చేశారు.

దేవ్‌జీ రాక‌తో మా ప్రపంచం తిరిగి వచ్చినట్టే.. తమ్ముడి కూతురు సుమ భావోద్వేగ వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్‌జీ (Devji) అలియాస్ తిపిరి తిరుపతి (Thipiri Tirupati) లొంగిపోనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తమ్ముడి కుమార్తె తిపిరి సుమ (Thipiri Suma) సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను, వీడియోను విడుదల చేశారు. దేవ్ జీ రాక కోసం వారి కుటుంబం ఎంతలా ఎదురుచూస్తోందని ఆ వీడియోలో ప్రస్తావించారు.

ఎన్నో ఏళ్ల ఎదురుచూపు..

నిజమైతే బాగుండుననే ఆశ.. ఇప్పుడు నిజమయ్యే రోజు దగ్గరకు వచ్చిందేమో అని సుమ అన్నారు. దేవ్ జీ లొంగుబాటు కేవలం ఒక రాజకీయ పరిణామం మాత్రమే కాదని, అది ఒక కుటుంబం యొక్క దశాబ్దాల నిరీక్షణ అని పేర్కొన్నారు. తన కొడుకు ఎప్పటికైనా తిరిగి రావాలని ఆ వృద్ధ తల్లిదండ్రుల ఆశ అని అన్నారు. తన అన్నను ఒక్కసారైనా చూడాలని రక్తం పంచుకుని పుట్టిన సోదరుడు పరితపిస్తున్నారని కామెంట్ చేశారు. మరోవైపు పెద్దనాన్న క్షేమంగా తిరిగి రావాలని తమ్ముడి పిల్లలమైన తాము ప్రార్థనలు చేస్తుమని సుమ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఆయనే మా కొండంత ధైర్యం..

‘దేవ్‌జీ’ రాక ఒక మనిషి రాక కాదు.. మా ప్రపంచం తిరిగి వచ్చినట్లేనని సుమ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనే మాకు ఓ ఆశ, ఒక నమ్మకం, కొండంత ధైర్యమని తెలిపింది. ఈ లొంగుబాటు నిర్ణయం దేవ్‌జీ ఇష్టపూర్వకమైతే అది తమ కుటుంబం చేసుకున్న అదృష్టమని, అందుకు సహకరిస్తున్న ప్రముఖులందరికీ సుమ వినమ్రంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే, తిపిరి సుమ ప్రస్తుతం విడుదల చేసిన లేఖతో పాటు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దశాబ్దాలుగా అడవి బాట పట్టిన తిపిరి తిరుపతి తిరిగి జనజీవన స్రవంతిలోకి వస్తే చూడాలని ఆ కుటుంబం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.

ముగిసిన మావోయిస్టు సాయుధ పోరాట అధ్యాయం.. అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్!

Next Story