- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన మావోయిస్టు సాయుధ పోరాట అధ్యాయం.. అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్!
ఆపరేషన్ కగార్‌లో భాగంగా తెలంగాణ పోలీసులు భారీ విజయం సాధించారు. మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి సహా 16 మంది సరెండర్ అయినట్లుగా తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: నాలుగు దశాబ్దాలకు పైగా దేశాన్ని ఉడికించిన మావోయిస్టు సాయుధ పోరాటం చరమాంకానికి చేరుకుంది. తెలంగాణ పోలీసుల సంచలన ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar)లో భాగంగా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, అగ్రనేత దేవ్‌జీ (Devji) అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు పొలిట్ బ్యూరో మెంబర్ మల్లా రాజిరెడ్డి (Malla Raji Reddy) పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే, అగ్రనేతల సరెండర్ల విషయాన్ని అందరికంటే ముందే ‘దిశ’ వెలుగులోకి తీసుకురావడం పట్ల పాఠకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
SIB ఎదుట ఆ ఇద్దరు సరెండర్!
గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ ఉద్యమాన్ని నడిపిస్తున్న దేవ్‌జీ, తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) అధికారుల ఎదుట లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మల్లా రాజిరెడ్డి ఆసిఫాబాద్ (Asifabad) అడవుల్లో పోలీసులకు చిక్కారు. వీరిద్దరితో పాటు మరో 16 మంది కీలక మావోయిస్టులు సరెండర్ అయినట్లుగా సమాచారం. దీనిపై మరో రెండు రోజుల్లో పోలీసులు అధికారిక ప్రకటన చేస్తూ వారిని మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పగ్గాలు చేపట్టారు. కేంద్ర కమిటీ సెక్రటరీగా ఉంటూ దేశవ్యాప్తంగా పార్టీ వ్యూహాలను ఆయనే రచించేవారు. అటువంటి అగ్రనేత లొంగిపోవడం పార్టీ ఉనికిని దాదాపుగా తుడిచిపెట్టినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆపరేషన్ కగార్.. గడువులోపే టార్గెట్ కంప్లీట్
దేశ వ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు గడువు విధించింది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతి చెందారు. హిడ్మా వంటి భీకర నేతలు ఎన్‌కౌంటర్లలో మరణించగా.. మల్లోజు వేణుగోపాల్, ఆశన్న వంటి వారు ఇప్పటికే లొంగిపోయారు. ఇక మరో అగ్రనేత గణపతి అనారోగ్యంతో విదేశాల్లో తలదాచుకోగా, ప్రస్తుతం గ్రేహౌండ్స్ (Greyhounds) దళాలు కేవలం బడే చొక్కారావు (Bade Chokka Rao) అలియాస్ దామోదర్ (Damodar) కోసం వేట కొనసాగిస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగిన తుపాకీ పోరాటం, వరుస ఎన్‌కౌంటర్లు, కీలక నేతల లొంగుబాట్లు, అనారోగ్య సమస్యలతో మావోయిస్టు పార్టీ తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది. తాజాగా దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి వంటి వారు జనజీవన స్రవంతిలోకి రావడంతో సుదీర్ఘ పోరాట చరిత్రకు ఎండ్ కార్డు పడినట్లైంది.






