మేము లొంగిపోతాం.. 3 రోజులు టైమ్ ఇవ్వండి: మావోయిస్టు కుంజం ఇడ్మల్ ఫోన్

by Prasad Jukanti |   (  Updated:2026-03-30 08:02:06  IST  )

ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు నేత కుంజం ఇడ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సమయం ఇస్తే చర్చించుకుని మార్చి 31లోపు లొంగిపోతామని వెల్లడించారు.

మేము లొంగిపోతాం.. 3 రోజులు టైమ్ ఇవ్వండి: మావోయిస్టు కుంజం ఇడ్మల్ ఫోన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆపరేషన్ కగార్ పేరుతో ప్రస్తుతానికి మావోయిస్టు పార్టీ లేకుండా ప్రభుత్వం చేసినా పీడిత ప్రజల కోసం భవిష్యత్‍లో మళ్లీ మావోయిస్టు పార్టీ పుట్టుకు వస్తుందని అజ్ఞాతంలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తడపలకు చెందిన మావోయిస్టు కుంజం ఇడ్మల్ అలియాస్ మహేందర్ అన్నారు. సరెండర్ల విషయంలో పార్టీలో సమిష్టి నిర్ణయం జరగలేదని అందరం కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదన్నారు. ఈ దేశంలోని పీడిత ప్రజల కోసం పని చేసిన మావోయిస్టు పార్టీ ఎప్పటికీ వారి పక్షానే ఉంటుందన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్ ప్రతినిధితో అజ్ఞాతంలో నుండే ఫోన్ ద్వారా మాట్లాడిన ఇడ్మల్.. పార్టీకి సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించారు.

సమయం ఇస్తే లొంగిపోతాం:

ఆపరేషన్ కగార్ నేపథ్యంలో అజ్ఞాతం వీడి బహిరంగ జీవితంలోకి వచ్చి పార్టీని కొనసాగించాలనే ఉద్దేశంతోనే సరెండర్లు జరుగుతున్నాయని ఇడ్మల్ చెప్పారు. సరెండర్ల విషయంలో ఇప్పటికే లొంగిపోయిన వారితో మాకు మధ్య అభిప్రాయ విభేదాలు ఉన్నాయి. ఉత్తరాల ద్వారా వచ్చిన సందేశాలతో లొంగిపోయేందుకు కొందరు అంగీకరిస్తే మరికొందరు అంగీకరించలేదన్నారు. పార్టీలో సమిష్టి నిర్ణయానికి అవకాశం లేకపోవడంతో వ్యక్తిగతంగా ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారని చెప్పారు. ప్రస్తుతం తనతో పాటు మరో 50 మంది వరకు ఉన్నారు. అలాగే వివిధ రాష్టాల్లో పార్టీ ఉంది. మేమంతా కలిసి నిర్ణయించుకనేలా ప్రభుత్వం మాకు 3 రోజుల అవకాశం కల్పిస్తే మేమంతా చర్చించుకుని మార్చి 31 లోపు లొంగిపోతామన్నారు. లేదా డెడ్ లైన్ ముగిశాక నిర్ణయించుకుంటామన్నారు.

మా వద్ద ఆయుధాలు, నిధులు ఉన్నాయి:

ఎందరో రక్తం ధారపోసి సాధించుకున్న ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగిస్తూ లొంగిపోవద్దనే ఒత్తిడి ప్రజల నుంచి పార్టీపై ఉందన్నారు. మా వద్ద ఆయుధాలు, నిధులు ఇంకా ఉన్నాయని చెప్పారు. మార్చి 31 లోపు పరిస్థితి సీరియస్‍గా ఉంటే అడవుల నుంచి బయటకు వస్తామని లేదా ఇక్కడే ఉంటామన్నారు. దేశ ప్రజల కోసం పని చేయాలని ఈ పార్టీలోకి వచ్చాం. మాకు బుల్లెట్లు తగిలినా పర్వాలేదని స్పష్టం చేశారు. కుటుంబాన్ని వదిలేసి వచ్చాం. ఇప్పుడు కుటుంబాలు గుర్తుకు రావడం లేదు. అనైతికంగా ఒత్తిడి చేయడం వల్లే ప్రజలు పార్టీకి దూరం అవుతున్నారు. కానీ 70 శాతం మంది ప్రజల మద్దతు మాకు ఉందన్నారు.

నాయకత్వాన్ని ఎంచుకుంటాం:

సోనూ, దేవ్ జీ, రాజీరెడ్డి వంటి కీలక నేతలు సరెండర్ అయ్యాక మీరు మాత్రమే అడవుల్లో ఉండి ఏం చేస్తారని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మిగతా అగ్రనేతలు లొంగిపోయినా మేమే కమిటీగా ఏర్పడి ఎవరు నాయకత్వం వహించాలనేది నిర్ణయించుకుని ముందుకు సాగుతామని ఇడ్మల్ తెలిపారు. అవకాశం ఉంటే మార్చి 31 లోపే కమిటీని ఎన్నుకుంటాం లేదా ఈ గడవు అయిపోయాక నిర్ణయించుకుంటామన్నారు. మేము చివరి వరకు అడవుల్లో ఉండి పోరాటం చేయాలనుకుంటున్నామన్నారు. గణపతి మాకు టచ్‍లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దేవ్‍జీ మాతో టచ్‍లోనే ఉన్నారని మార్చి 21 వరకు ఆయన మాతో మాట్లాడారు. మనం కలిసి నిర్ణయం తీసుకుందామని చెప్పారన్నారు.

BIG NEWS: మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

Next Story