BIG NEWS: మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-30 08:07:20  IST  )

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ హరీష్ గుప్తా వెల్లడించారు. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ నేపథ్యంలో కీలక నేతలంతా లొంగిపోయినట్లు తెలిపారు.

BIG NEWS: మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
X
  • ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు లొంగుబాటు
  • మరో 8మంది లొంగుబాటు
  • రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బతగిలేలా కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు 36 సంవత్సరాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్)లో పనిచేసిన సీనియర్ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ సహా మొత్తం 9 మంది మావోయిస్ట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది. లొంగిపోయిన వారిలో కర్తం లచ్చు, పోడియం రాజే, కర్తం అడమే, ముచ్చిక మాస, మడవి జోగి, ముచ్చిక లక్ష్మణ్, మడవి ఆడమ, కడితి హుర్రే వంటి కీలక కేడర్లు ఉన్నారు. ప్రభుత్వ సరెండర్ అండ్ పునరావాస విధానం ప్రకారం, చెల్లూరి నారాయణరావుకు రూ.25 లక్షలు, కర్తం లచ్చుకు రూ.5 లక్షలు, ఇతర ముఖ్య కేడర్లకు రూ.4 లక్షలు చొప్పున, అలాగే మిగిలిన వారికి రూ.1 లక్ష చొప్పున ప్రోత్సాహక నగదు ప్రకటించారు. అదనంగా తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున డీజీపీ అందజేశారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రదర్శించారు. వీటిలో ఇన్సాస్ రైఫిల్, బీజీఎల్‌లు, 303 రైఫిళ్లు, ఎస్‌బిబిఎల్‌లు తదితరంగా మొత్తం 19 ఆయుధాలు ఉన్నాయి.

డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ గత సంవత్సరం కాలంలో రాష్ట్ర పోలీసులు మావోయిస్టు పార్టీపై విశేష విజయాలు సాధించారని తెలిపారు. పలువురు కేంద్ర కమిటీ సభ్యులు, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు సహా కీలక మావోయిస్ట్ నాయకులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారని వెల్లడించారు. అలాగే, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్ర పోలీసులతో సమన్వయం ద్వారా అనేక ఆపరేషన్లలో సహకరించామని చెప్పారు. కృష్ణా, ఏలూరు, ఎన్‌టీఆర్, కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మావోయిస్టుల కుట్రలను భగ్నం చేసి, 50 మంది సభ్యులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అదనంగా, మొత్తం 31 మంది ఇతర మావోయిస్ట్ సభ్యులు అరెస్టు కాగా, 106 మంది లొంగిపోయినట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా ఆయుధాల డంప్‌లను వెలికితీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీటిలో ఎకే-47, ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఇన్సాస్ రైఫిళ్లు, పేలుడు పదార్థాలు సహా 120కు పైగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టడంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, గ్రేహౌండ్స్, జిల్లా పోలీసుల కృషిని డీజీపీ అభినందించారు. దీర్ఘకాలిక వ్యూహాత్మక చర్యల ఫలితంగా రాష్ట్రంలో ఎల్‌డబ్ల్యూఈ అండర్‌గ్రౌండ్ కేడర్ సంఖ్యను సున్నాకి తగ్గించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీలు, ఐజీలు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మేము లొంగిపోతాం.. 3 రోజులు టైమ్ ఇవ్వండి: మావోయిస్టు కుంజం ఇడ్మల్ ఫోన్

Next Story