- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనంతారం జడ్పీహెచ్‌ఎస్‌లో ఖాళీగా కీలక పోస్టు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
కరకగూడెం మండలం అనంతారం జడ్పీహెచ్‌ఎస్‌లో ఫిజిక్స్ ఉపాధ్యాయ పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది.

దిశ, కరకగూడెం: పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తుతో అధికారులు చెలగాటమాడుతున్నారా..? రెండేళ్లుగా కీలకమైన ఫిజిక్స్ సబ్జెక్టుకు ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కరకగూడెం మండలం అనంతారం జడ్పీహెచ్‌ఎస్‌లో ఫిజిక్స్ ఉపాధ్యాయ పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. గతంలో పనిచేసిన ఉపాధ్యాయురాలు డిప్యూటేషన్‌పై పాల్వంచ కేటీపీఎస్ జడ్పీహెచ్‌ఎస్‌కు వెళ్లినప్పటి నుంచి ఈ పోస్టును భర్తీ చేయలేదు. దీంతో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న దాదాపు 50 మంది విద్యార్థులు ఫిజిక్స్ పాఠాలకు దూరమవుతున్నారు.
పరీక్షల సమయంలో పరిస్థితి ఏంటి..?
పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే సమయంలో అత్యంత కీలకమైన ఫిజిక్స్ సబ్జెక్టుకు బోధించే వారు లేకపోవడం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. సైన్స్‌లో ముఖ్యమైన భాగమైన ఫిజిక్స్‌పై పట్టు లేకపోతే పరీక్షా ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్లు గడిచినా పట్టించుకోరా..?
ఒక ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా ఉండటం సాధారణ విషయం కావచ్చు.. కానీ అదే సమస్య రెండేళ్ల పాటు కొనసాగుతూ విద్యార్థుల చదువు పై ప్రభావం చూపుతున్న అధికారులు స్పందించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తు కంటే ఖాళీ పోస్టుల నిర్వహణే ముఖ్యమా అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా మేల్కొంటారా..?
అనంతారం జడ్పీహెచ్‌ఎస్‌లో వెంటనే ఫిజిక్స్ ఉపాధ్యాయుడిని నియమించి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, జిల్లా విద్యాశాఖ అధికారులను విద్యార్థులు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించకపోతే తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






