రౌడీ షీటర్‌పై పీడీ చట్టం అమలు..

by Kodari Anjali |

కరుడుగట్టిన రౌడీ షీటర్ బొజ్జ భాగ్యరాజ్‌పై పీడీ చట్టం కింద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు.

రౌడీ షీటర్‌పై పీడీ చట్టం అమలు..
X

దిశ, సికింద్రాబాద్: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన కరుడుగట్టిన రౌడీ షీటర్ బొజ్జ భాగ్యరాజ్‌పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయగా, వాటిని చిలకలగూడ పోలీసులు సోమవారం అమలు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, బొజ్జ భాగ్యరాజ్‌ పై హైదరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 15 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం, అల్లర్లు, తీవ్ర గాయాలు, బెదిరింపులు, పోక్సో చట్టం కింద నమోదైన కేసులు సహా పలు తీవ్రమైన నేరాల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. గతంలో రెండుసార్లు పీడీ చట్టం కింద నిర్బంధించినప్పటికీ, అనంతరం భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్–128 ప్రకారం బైండోవర్ చేసినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు తెలిపారు.

నిర్బంధ ఉత్తర్వులు జారీ

ఇటీవల నమోదైన మూడు హత్యాయత్నం కేసుల్లోనూ అతను నిందితుడిగా ఉండగా, బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా షరతులను ఉల్లంఘిస్తూ తిరిగి నేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుడి నిరంతర నేరపూరిత కార్యకలాపాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని, శాంతిభద్రతలకు ముప్పుగా మారిన నేపథ్యంలో భవిష్యత్తులో నేరాలను అరికట్టేందుకు పీడీ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. పీడీ ప్రతిపాదనను చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ, వారి బృందం సిద్ధం చేయగా, ఏసీపీ కె. శశాంక్ రెడ్డి పర్యవేక్షణలో, సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ జె. నర్సయ్య సమగ్ర పర్యవేక్షణలో ఉత్తర్వులను అమలు చేసినట్లు సికింద్రాబాద్ జోన్ డిసిపి రక్షిత కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ సందర్భంగా నగరంలో నేరాలు, సంఘవిద్రోహ కార్యకలాపాలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. నిత్య నేరస్థులు, రౌడీ షీటర్లు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై "జీరో టాలరెన్స్" విధానంతో కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Next Story