- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 15 తర్వాత బీజేపీ ఆఫీసు వద్దే తేల్చుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
ఎట్టి పరిస్థితుల్లోనూ తుమ్మడిహెట్టి బ్యారేజీని నిర్మించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను కేంద్రం తీసుకోకపోతే జూన్ 15 తర్వాత బీజేపీ ఆఫీసు వద్దే తేల్చుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన రూ.112.14 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టుతో పాటు ఆసిఫాబాద్‌లో మున్సిపల్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొని అక్కడే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ తుమ్మడిహెట్టి బ్యారేజీని నిర్మించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై తాము ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్నామని, మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే తాము ఎన్ని లేఖలు రాసినా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి కనీస స్పందన, గౌరవం లభించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర సీఎం చీకటి మిత్రుడైన కేసీఆర్‌కో, ప్రధాని మోదీకో తాను నచ్చకపోవడం వల్లే ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారేమోనని కామెంట్ చేశారు.
మహారాష్ట్ర 2 వేల ఎకరాల భూమిని ఇవ్వలేదా..
ఒకవేళ మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మడిహెట్టిపై స్పందించకపోతే ఆదిలాబాద్ ప్రజలు ఉప్పెనలా ఎగసిపడతారని, ఆదిలాబాద్ కదిలితే మహారాష్ట్రకే నష్టమని హెచ్చరించారు. నాడు పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను కలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ, నేడు తుమ్మడిహెట్టి కోసం మహారాష్ట్ర 2 వేల ఎకరాల భూమిని ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో మహారాష్ట్ర సీఎం సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. గత పాలకులు తుమ్మడిహెట్టిని పక్కన పెట్టేసి, లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చారని ముఖ్యమంత్రి విమర్శించారు. తుమ్మడిహెట్టిని నిర్మిస్తే ఎలాంటి లిఫ్టుల అవసరం లేకుండా, కేవలం గ్రావిటీ ద్వారానే నీళ్లు అందుతాయని, రైతుల సమస్యల విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
సత్రంలో భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ అక్కర్లేదు..!
ఇదే వేదికపై నుంచి ధాన్య సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతుల నుంచి ఇప్పటికే 75 లక్షల క్వింటాళ్ల వడ్లు, 40 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నలను కొనుగోలు చేస్తున్నామని, ఆ ధాన్యాన్ని కేంద్రం వెంటనే సేకరించాలని డిమాండ్ చేశారు. ‘సత్రంలో పెట్టే భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ అవసరం లేదు’ అంటూ కిషన్ రెడ్డిపై సెటైర్లు వేసిన సీఎం, రాష్ట్ర ప్రభుత్వం కొనే పంటను కేంద్రం తీసుకునేలా ఆయన బాధ్యత వహించాలని అన్నారు. ఒకవేళ కేంద్రం గనుక ఈ పంటను తీసుకోకపోతే, జూన్ 15 తర్వాత హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం వద్దే తేల్చుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇళ్లకు నిధులిస్తా: ఆదివాసీలకు సీఎం రేవంత్ అభయం






