రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ విద్యుత్ లైన్లు..?

by Ratna Kumari |

రిజర్వ్ ఫారెస్ట్‌లో అనుమతులు లేకుండా విద్యుత్ స్థంభాల ఏర్పాటు, రైతుల నుంచి వసూళ్ల ఆరోపణలపై విచారణకు డిమాండ్.

రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ విద్యుత్ లైన్లు..?
X

దిశ, లక్ష్మీదేవిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో అటవీశాఖ అనుమతులు లేకుండానే విద్యుత్ స్థంభాలు, విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అటవీశాఖ వర్గాల సమాచారం ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో ఇప్పటికే 127 విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో అటవీ, విద్యుత్ శాఖల పనితీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటవీ భూముల్లో విద్యుత్ లైన్లు, స్థంభాలు లేదా ఇతర నిర్మాణ పనులు చేపట్టాలంటే కేంద్ర అటవీ సంరక్షణ చట్టం, అటవీ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు తప్పనిసరి. అయితే ఆ నిబంధనలను పక్కనబెట్టి కొందరు విద్యుత్ శాఖ, అటవీశాఖ క్రింది స్థాయి సిబ్బంది కుమ్మక్కై ఉన్నతాధికారులకు సమాచారం లేకుండానే విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రైతుల నుంచి భారీ వసూళ్ల ఆరోపణలు..

ఈ వ్యవహారంలో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చి వారి నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారిక అనుమతులు లేకుండా పనులు చేపట్టడంతో అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేయగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సాగునీటి కోసం విద్యుత్‌పై ఆధారపడిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, సాగు పనుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా ప్రస్తుతం పంటలకు నీరు అందక ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనేక ప్రశ్నలకు సమాధానాలు కరువు..

ఈ ఘటనతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటవీ అనుమతులు లేకుండా 127 విద్యుత్ స్థంభాలు ఎలా ఏర్పాటు చేశారు? సంబంధిత అధికారులు ఎక్కడ ఉన్నారు? రైతుల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్న డబ్బు ఎవరి చేతుల్లోకి వెళ్లింది? ఈ వ్యవహారానికి బాధ్యులెవరు? పంట నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు? రైతులకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లభించలేదు. అటవీశాఖ అధికారులు మాత్రం రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టాలన్నా శాఖ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

కొత్త డీఎఫ్‌వో ముందున్న తొలి సవాలు..

ఇటీవల బాధ్యతలు చేపట్టిన జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) ముందున్న తొలి కీలక సవాలుగా ఈ వ్యవహారం మారింది. అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తారా? రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై నిజానిజాలు వెలికితీస్తారా? బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా? అనే అంశాలపై జిల్లావ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారంలో కేవలం క్రింది స్థాయి ఉద్యోగులే బాధ్యులా? లేక ఉన్నతాధికారుల పర్యవేక్షణ వైఫల్యమా? అన్న కోణంలోనూ దర్యాప్తు జరగాలని రైతులు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని అటవీ, విద్యుత్, విజిలెన్స్ శాఖలతో సంయుక్త విచారణ నిర్వహించాలని, రైతుల నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ఈ అక్రమాలపై కొత్త డీఎఫ్‌వో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? బాధ్యులను గుర్తించి రైతులకు న్యాయం చేస్తారా? లేక వ్యవహారం విచారణలకే పరిమితమవుతుందా? అనే ఉత్కంఠ జిల్లావ్యాప్తంగా నెలకొంది.

Next Story