- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మఠంపల్లి నకిలీ డీఏపీ కేసు ఛేదన
మఠంపల్లి నకిలీ డీఏపీ కేసులో రూ.1.50 కోట్ల విలువైన వెయ్యి నకిలీ ఎరువుల బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దిశ, హుజూర్‌నగర్ : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో వెలుగుచూసిన నకిలీ డీఏపీ ఎరువుల కేసును హుజూర్‌నగర్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. రైతు ఫిర్యాదు మేరకు నమోదైన కేసును సవాలుగా తీసుకున్న హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేటలో మెరుపు దాడులు నిర్వహించి భారీ నకిలీ ఎరువుల గుట్టును రట్టుచేశారు. గతవారం మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు కొనుగోలు చేసిన డీఏపీ ఎరువులు నకిలీవని నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో లభించిన కీలక ఆధారాల ఆధారంగా సీఐ చరమంద రాజు, మఠంపల్లి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌తో కలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేటలో ఉన్న ఓ గోదాముపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.1.50 కోట్ల విలువైన వెయ్యి నకిలీ డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన ప్రధాన నిందితులు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న నకిలీ ఎరువులను తదుపరి చర్యల కోసం వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. దర్యాప్తులో నకిలీ డీఏపీ ఎరువులను గ్రోమోర్, కోరమండల్, అన్నపూర్ణ తదితర ప్రముఖ కంపెనీల పేర్లతో ఉన్న ఖాళీ సంచుల్లో ఉప్పు, మట్టి వంటి నాసిరకం పదార్థాలను రసాయనాలతో కలిపి తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రింటింగ్, స్టిచ్చింగ్ యంత్రాల ద్వారా అసలు కంపెనీల ప్యాకింగ్‌ను పోలి ఉండే సంచులను తయారు చేసి రైతులను మోసం చేస్తున్నట్లు తేలింది.
ఏజెంట్ల ద్వారా పలుచోట్లకు సరఫరా..
ఈ నకిలీ ఎరువులను డీసీఎం వాహనాల ద్వారా మఠంపల్లి మండలం రఘునాథపాలెం, మేళ్లచెరువు, నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి తదితర ప్రాంతాలకు ఏజెంట్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో డీఏపీ బస్తాను సుమారు రూ.1,500కు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుల కోసం గాలింపు..
పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు కొనసాగుతోందని సీఐ చరమంద రాజు తెలిపారు. రైతులు తప్పనిసరిగా అధికారిక ఎరువుల డీలర్ల వద్ద నుంచే ఎరువులు కొనుగోలు చేసి బిల్లు తీసుకోవాలని, అనుమానాస్పద ఎరువుల విక్రయాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.






