తూకాల్లో మోసాలు... మాంసంలో తేడాలు..!!

by Ratna Kumari |

ప్రజలు నమ్మకంతో కొనుగోలు చేస్తున్న మటన్, చికెన్, చేపల దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

తూకాల్లో మోసాలు... మాంసంలో తేడాలు..!!
X

దిశ, ఇల్లెందు: ప్రజలు నమ్మకంతో కొనుగోలు చేస్తున్న మటన్, చికెన్, చేపల దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేజీ మాంసం పేరుతో వందల గ్రాములు తక్కువ తూకం వేయడం, పాత మాంసాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ చేసి తాజాగా విక్రయించడం, మేక మాంసం పేరుతో గొర్రె మాంసాన్ని విక్రయించడం, చేపల దుకాణాల్లో భారీగా తూకాల్లో మోసాలకు పాల్పడటం వంటి అంశాలు తూనికలు–కొలతల శాఖ అధికారుల తనిఖీల్లో బయటపడటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అధిక ధరలు వసూలు చేస్తూనే, మరోవైపు తక్కువ తూకం వేయడం ద్వారా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు.

కేజీకి 200 నుంచి 300 గ్రాముల వరకు తక్కువ తూకం..

తనిఖీల్లో పలు దుకాణాల్లో కేజీ మాంసం పేరుతో 200 నుంచి 300 గ్రాముల వరకు తక్కువ తూకం వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే వినియోగదారుడు కేజీకి డబ్బులు చెల్లించినా, చేతికి చేరేది 700 నుంచి 800 గ్రాములే. ఇలా ప్రతి కస్టమర్ వద్ద కొద్దికొద్దిగా మోసం చేస్తూ రోజుకు వేల రూపాయల అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.

ఫ్రిజ్‌లలో నిల్వ చేసి పాత మాంసం విక్రయాలు..

తాజా మాంసం పేరుతో పలు దుకాణాల్లో అమ్ముడుపోని మిగిలిన మాంసాన్ని ఫ్రిజ్‌లలో రోజులు తరబడి నిల్వ ఉంచి తిరిగి విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. నిల్వ విధానంలో పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఆ మాంసం ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మాంసం తీసుకోవడం వల్ల ఆహార విషబాధ, వాంతులు, విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

మేక మాంసం పేరుతో గొర్రె మాంసం...

మార్కెట్‌లో మేక మాంసానికి అధిక ధర ఉండటాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు గొర్రె మాంసాన్ని మేక మాంసంగా విక్రయిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. వినియోగదారులు గుర్తించలేరనే భావనతో ఈ మోసానికి పాల్పడుతున్నారని సమాచారం. ఇది వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీసే చర్యగా అధికారులు పేర్కొంటున్నారు.

చేపల దుకాణాల్లోనూ భారీ అక్రమాలు..

మటన్, చికెన్ దుకాణాలకే పరిమితం కాకుండా చేపల దుకాణాల్లోనూ తూకాల్లో భారీ తేడాలు బయటపడ్డాయి. డిజిటల్ త్రాసులను సక్రమంగా ఉపయోగించకపోవడం, ధృవీకరణ లేని త్రాసులతో తూకం వేయడం వంటి ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు పలువురు వ్యాపారులపై చర్యలు చేపట్టారు.

జరిమానాలు విధించిన తూనికలు–కొలతల శాఖ..

తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన మాంసం, చేపల దుకాణాల యజమానులపై తూనికలు–కొలతల శాఖ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించింది. వినియోగదారులను మోసం చేసే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మాంసం లేదా చేపలు కొనుగోలు చేసే సమయంలో తూకాన్ని తప్పనిసరిగా గమనించాలని, త్రాసుపై చూపిస్తున్న బరువును పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. తూనికలు–కొలతల శాఖ ముద్ర (స్టాంపింగ్) ఉన్న త్రాసులనే ఉపయోగిస్తున్నారా లేదా అనేది కూడా చూడాలని తెలిపారు. తక్కువ తూకం, అధిక ధరలు, నాసిరకం లేదా అనుమానాస్పద మాంసం విక్రయిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

"తూకాల్లో తేడా వస్తే కఠిన చర్యలు తప్పవు :తూనికలు–కొలతల శాఖ జిల్లా అధికారి మనోహర్

జిల్లాలో మాంసం, చికెన్, చేపల దుకాణాలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. తక్కువ తూకం వేయడం, నిబంధనలు ఉల్లంఘించడం, వినియోగదారులను మోసం చేయడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే దుకాణాలపై చట్టపరమైన చర్యలతో పాటు జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిది కొన్ని రూపాయల లాభం కోసం వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీయడం, వారి ఆరోగ్యంతో చెలగాటమాడడం సమాజానికి హానికరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు, వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడుతుందని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి.

Next Story