- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health tips : విపరీత కరణి.. ఆరోగ్య ప్రదాయిని!
విపరీత కరణి యోగాసనంతో కాళ్లు, పాదాలు, చీలమండల్లో వాపు తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.

దిశ, ఫీచర్స్ : ఉరుకులూ పరుగుల జీవితంలో వ్యాయమాలకు సమయం ఉండట్లేదా? నిత్యం కూర్చొని ఉండే నిశ్చల జీవనశైలితో ఇబ్బందులా? కాళ్ల వాపులతో అవస్థలా? అయితే వీటి నుంచి బయటపడే ఒక చక్కటి పరిష్కారమే విపరీత కరణి యోగ (Legs up the wall) అంటున్నారు యోగా నిపుణులు. దీనివల్ల మానసిక ప్రశాంతత చేకూరడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకీ అవేమిటి? ఈ యోగా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా చేయాలి?
నిజానికి లెగ్స్ అప్ ది వాల్ అనేది చాలా సులువైన యోగా భంగిమ.కేవలం 5 నుంచి 15 నిమిషాలు సౌకర్యవంతంగా చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. ఇక ఎలా చేయాలనే విషయానికి వస్తే.. ఇంట్లోని ఒక గదిలో లేదా వరండాలో కాళ్లను గోడకు ఆనించి పైకి ఎత్తి ఉంచాలి. ఇలా కాసేపు చేయడంవల్ల కాళ్లు, పాదాలు, చీలమండల్లో వాపు తగ్గుతుందని, రక్త ప్రసరణ మెరుగు పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ భంగిమ రక్తం, అలాగే లింఫాటిక్ ద్రవం గుండె వైపు సులభంగా ప్రవహించడానికి సహాయపడుతుంది. ఎక్కువసేపు నిలబడి, నడిచి లేదా కూర్చొని జీవనశైలి కలిగి ఉన్నవారికి ఈ యోగా మంచి ఉపశమనం ఇస్తుంది.
నాడీ వ్యవస్థకు ప్రేరణగా..
కరణియోగా భంగిమ శరీరంలో పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను (Rest and Digest) యాక్టివేట్ చేయడం ద్వారా రిలాక్సేషన్‌ను పెంపొందిస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గి, కండరాల టెన్షన్ వదిలిపోయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది ఈ భంగిమ చేసిన తర్వాత నిద్ర నాణ్యత మెరుగుపడిందని, కాళ్ల అలసట తగ్గిందని చెబుతుంటారు. కాబట్టి ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ యోగా లేదా భంగిమ ఆరోగ్యానికి మంచిదే అయినా, ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా చూడకూడదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా గ్లాకోమా, అనియంత్రిత హై బీపీ, గుండె సమస్యలు, కళ్లు లేదా పొట్టపై శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఈ భంగిమ చేయాలా వద్దా అనే విషయంలో డాక్టర్ల సలహాలు పాటించాలి.
ప్రయోజనాలు
*వాపు తగ్గడం : కాళ్లు, చీలమండలు, పాదాల్లో వాపు (ఎడెమా) తగ్గుతుంది. గురుత్వాకర్షణ శక్తి వల్ల రక్తం, లింఫాటిక్ ద్రవం గుండె వైపు సులభంగా తిరిగి వస్తాయి.
*అలసట తగ్గడం: ఎక్కువసేపు నిలబడి పని చేసిన వారు, నడిచిన వారు, లేదా ఎక్కువసేపు కూర్చొని ఉన్నవారికి కాళ్ల అలసట, భారం తగ్గుతుంది.
*ఒత్తిడి & ఆందోళన తగ్గడం: పారాసింపతెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేసి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది.
*రక్తప్రసరణ మెరుగు: కాళ్లలో రక్తప్రవాహం మెరుగుపడి, శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది.
*జీర్ణక్రియ & హార్మోన్ల సమతుల్యం: కొంతమందికి జీర్ణ సమస్యల్లో కూడా ఉపశమనం లభిస్తుంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






