మహిళను వివస్త్రను చేసిన ఘటన.. సోషల్ మీడియా యూజర్లకు మహిళా కమిషన్ హెచ్చరిక

by Naga Rani Yarlagadda |

గుంటూరు జిల్లాలో మహిళను వివస్త్రను చేసి.. ఘోరంగా అవమానించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

మహిళను వివస్త్రను చేసిన ఘటన.. సోషల్ మీడియా యూజర్లకు మహిళా కమిషన్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో మహిళను వివస్త్రను చేసి.. ఘోరంగా అవమానించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు తీవ్రంగా క్షీణించాయని అధికార పార్టీలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. తాజాగా దీనిపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండించిన కమిషన్ ఛైర్‌పర్సన్ శైలజ, బాధితురాలి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సమాజం అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఛైర్‌పర్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ అవమానకర వీడియోలను సోషల్ మీడియాలో ఎవరూ షేర్ చేయవద్దని, ఇప్పటికే ఉన్న వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి గ్రూపుల్లో ఈ వీడియోలు మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్, గ్రూప్ అడ్మిన్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించి సహకరించాలని ఆమె కోరారు.

ఏ పార్టీ వారైనా శిక్ష తప్పదు: మహిళా కమిషన్ హెచ్చరిక..

ఈ ఘోరానికి ఒడిగట్టిన దుండగులపై కఠిన చర్యలు ఉంటాయని ఛైర్‌పర్సన్ శైలజ స్పష్టం చేశారు. "మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. తప్పు చేసిన వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా, ఎంతటి అండదండలు ఉన్నవారైనా సరే చట్టం ముందు మోకరిల్లాల్సిందే. వారికి కఠిన శిక్ష పడేలా కమిషన్ చర్యలు తీసుకుంటుంది" అని ఆమె హెచ్చరించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు మహిళా కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Next Story