- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫారెస్ట్ అధికారుల దాడిలో గాయపడిన ఆదివాసీ మహిళలను పరామర్శించిన ఆదివాసీ నాయకులు
మండల పరిధిలోని మనుబోతులగూడెం, వేములూరు గ్రామాల్లో అటవీ శాఖ అధికారుల దాడిలో గాయపడిన ఆదివాసీ మహిళలను ఆదివాసీ సంఘాల నాయకులు పరామర్శించారు.

దిశ, అశ్వాపురం : మండల పరిధిలోని మనుబోతులగూడెం, వేములూరు గ్రామాల్లో అటవీ శాఖ అధికారుల దాడిలో గాయపడిన ఆదివాసీ మహిళలను శనివారం ఆదివాసీ సంఘాల నాయకులు పరామర్శించారు. బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆదివాసీ సంఘాల నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, వేములూరు పంచాయతీ పరిధిలోని మనుబోతులగూడెం ప్రాంతంలో వలస ఆదివాసీలు గత కొన్ని సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఏడాది పోడు సాగు విషయంలో అటవీ శాఖ అధికారులు, పోడుదారుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.
ఈ ఏడాది వారు సాగు చేస్తున్న సుమారు 150 ఎకరాల్లో ప్లాంటేషన్ ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ అధికారులు శుక్రవారం జేసీబీతో వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో మడకం గంగమ్మ, సవలం జ్యోతి, మడకం సీతమ్మ, కణితి సారమ్మ, సోడే సాయమ్మ అనే ఐదుగురు మహిళలు గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఆదివాసీ సంఘాల నాయకులు మహిళలపై విచక్షణారహితంగా దాడి చేయడం ఖండనీయమని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్న పోడు భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. మహిళలపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాల్సిందే గానీ దాడులకు పాల్పడటం సమంజసం కాదని పేర్కొన్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి తంగెళ్ల భద్రయ్య మాట్లాడుతూ ఆదివాసుల హక్కులను పరిరక్షించేందుకు తమ సంఘం అండగా నిలుస్తుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పోడియం బాలరాజు, ముస్కు శ్రీనివాస్ రెడ్డి, అశ్వాపురం ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు కల్లూరి నరసింహరావు, తుడుం దెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి తంగెళ్ల భద్రయ్య, మండల పీసా మొబిలైజర్ బండ్ల మునేశ్వర్, మండల పీసా అధ్యక్షుడు చాప ముత్తయ్య, గణిబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.






