- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా గుప్పెట్లోనే శాఖలన్నీ... అన్న ధీమా వెనుక ఎవరి అండ?
పాల్వంచ పట్టణ శివారులోని శ్రీ వెంకటేశ్వర క్రాకర్స్ వ్యవహారం రోజురోజుకూ చర్చనీయాంశంగా మారుతోంది.

దిశ, పాల్వంచ టౌన్ : పాల్వంచ పట్టణ శివారులోని శ్రీ వెంకటేశ్వర క్రాకర్స్ వ్యవహారం రోజురోజుకూ చర్చనీయాంశంగా మారుతోంది. అనుమతులకు మించి క్రాకర్స్ నిల్వలు ఉంచుతున్నారని, ప్రభుత్వ భూమిలోనే వ్యాపారం కొనసాగుతోందని, స్థానిక ప్రజాప్రతినిధుల అండతో అధికారులను మభ్యపెడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ అంశంపై కథనాలు వెలువడిన నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు శాఖలు స్పందించాయి.స్థానికుల కథనం ప్రకారం, యాజమాన్యం "డిపార్ట్‌మెంట్లు మొత్తం మా గుప్పెట్లోనే ఉన్నాయి... ఎవరు ఏమి రాసినా జరిగేది ఏమీ లేదు" అంటూ ధీమాగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఒకే షాపుకు పరిమితం కాకుండా మూడు, నాలుగు గోదాముల్లో భారీగా క్రాకర్స్ నిల్వలు ఉంచినట్లు చెబుతున్నారు. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అంతేకాకుండా రిజర్వ్ ఫారెస్ట్‌ను ఆనుకుని ఉన్న ప్రభుత్వ సర్వే నంబర్ 817లో వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ భూమిలో వ్యాపారానికి అనుమతులు ఎలా మంజూరయ్యాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం : తహసీల్దార్ దారా ప్రసాద్
ఈ వ్యవహారంపై పాల్వంచ తహసీల్దార్ దారా ప్రసాద్‌ను వివరణ కోరగా, "క్రాకర్స్ షాప్ ప్రభుత్వ సర్వే నంబర్‌లో ఉందనే విషయం ప్రస్తుతం నాకు తెలియదు. గతంలో ఉన్న రికార్డులను పూర్తిగా పరిశీలించాల్సి ఉంది. ప్రస్తుతం నేను కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాను. సోమవారం సంబంధిత రికార్డులను పరిశీలించి, వాస్తవాలు నిర్ధారించుకున్న అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు.
పరిశీలించాం... తయారీ కనిపించలేదు: పట్టణ ఎస్సై నాగరాజు
పాల్వంచ పట్టణ ఎస్సై నాగరాజు మాట్లాడుతూ.. "మీరు ప్రచురించిన వార్త ఆధారంగా మా టౌన్ రెండో ఎస్సై విజయను పరిశీలనకు పంపించాం. అక్కడ తనిఖీ నిర్వహించగా ఆ సమయంలో ఎటువంటి క్రాకర్స్ తయారీ ప్రక్రియ జరగడం కనిపించలేదు. ప్రత్యక్షంగా నిబంధనలకు విరుద్ధమైన కార్యకలాపాలు గుర్తిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ వ్యవహారంపై మా సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాం" అని తెలిపారు. ఇదిలా ఉండగా, అనుమతులకు మించి నిల్వలు ఉన్నాయా? ప్రభుత్వ భూమిలోనే వ్యాపారం జరుగుతోందా? అన్ని అనుమతులు నిబంధనల ప్రకారమే పొందారా? అనే అంశాలపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి రెవెన్యూ, అగ్నిమాపక, పోలీసు, అటవీ తదితర శాఖలతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, అక్రమాలు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






