ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ.. 2026 ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి

by Batti.Sumithra |

ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ–2026 కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, తెలంగాణ రాష్ట్ర స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ శాఖ కార్యదర్శి హరి చందన దాసరి అన్నారు.

ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ.. 2026 ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి
X

దిశ, వరంగల్ బ్యూరో : ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ–2026 కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, తెలంగాణ రాష్ట్ర స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ శాఖ కార్యదర్శి హరి చందన దాసరి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో శనివారం హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతి పై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎన్యుమరేషన్ ప్రక్రియ, ఇంటింటి సర్వే, ఫారాల పంపిణీ, స్వీకరణ, మ్యాపింగ్, డిజిటలైజేషన్, అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చడం, అనర్హుల వివరాల పరిశీలన, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాల పై అధికారులతో సమగ్రంగా చర్చించి పలు సూచనలు చేశారు.

భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, కాలపట్టికను కచ్చితంగా పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ పై ప్రజల్లో మరింత విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్లు ఎందుకు దరఖాస్తు సమర్పించాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా సమర్పించాలి, అవసరమైన పత్రాలు ఏమిటి, తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు వంటి సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. శాశ్వతంగా నివాసం మారిన వారు, వలస వెళ్లిన వారు, ఓటరు జాబితాలో మార్పులు చేయించుకోవాల్సిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు నమోదు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, పనితీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు సరైన సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఒక్క అర్హుడైన ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా చూడాలని పేర్కొన్నారు. జిల్లా అధికారులు ప్రతిరోజూ కార్యక్రమ పురోగతిని పోలింగ్ కేంద్రాల వారీగా విశ్లేషిస్తూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర స్థాయి నుంచి అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులను సకాలంలో పరిశీలించి పరిష్కరించాలని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందేలా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలు ఉన్నాయని, 5.09 లక్షల మంది ఓటర్లు, 483 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 100 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, 68.13 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. గైర్హాజరు ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఎన్నికల అధికారులు, సూపర్‌వైజర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బీఎల్‌ఏలను నియమించి, వారికి గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు చెప్పారు. ఎస్‌ఐఆర్‌ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2కే రన్, మీడియా సమావేశాలు, ప్రచార వాహనాలు, బీఎల్‌ఏలకు శిక్షణ, ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌ల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఒక్క అర్హుడైన ఓటరు కూడా మిగిలిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా స్థాయిలో మీడియా మానిటరింగ్ సెంటర్, కలెక్టరేట్‌తో పాటు ఈఆర్‌వో, ఏఈఆర్‌వో కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి దరఖాస్తుల పూరణలో సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరిస్తూ, కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు పై 48 గంటల్లోపు స్పందించేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు.

వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్యశారద మాట్లాడుతూ వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 71 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. పోలింగ్ స్టేషన్‌ల వారీగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ పురోగతి, క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్‌కు వివరించారు.

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం అమలులో చేపట్టిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో 100 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తికాగా, 74 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేస్తుందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు 71.74 శాతం ఎస్‌ఐఆర్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన కాలపట్టిక మేరకు మిగిలిన ప్రక్రియను కూడా సకాలంలో పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జి మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 100 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కాగా, 75.60 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. ఎన్నికల విభాగ అధికారులు, ఈ ఆర్ఓలు, ఏఈ ఆర్ఓలు, ఎన్నికల విభాగ పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story