తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇళ్లకు నిధులిస్తా: ఆదివాసీలకు సీఎం రేవంత్ అభయం

by Kema Shiva Kumar |

ఆదివాసీల కోసం అదనంగా మరో 21 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇళ్లకు నిధులిస్తా: ఆదివాసీలకు సీఎం రేవంత్ అభయం
X

దిశ, వెబ్‌డెస్క్: తన తల తాకట్టు పెట్టి అయినా సరే ఇందిరమ్మ ఇళ్లకు నిధులిస్తానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివాసీలకు భరోసానిచ్చారు. ఇవాళ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన రూ.112.14 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టుతో పాటు ఆసిఫాబాద్‌లో మున్సిపల్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొని అక్కడే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో తన సొంత జిల్లా అయిన పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్‌కు కూడా ప్రాధాన్యతనిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా ఆదిలాబాద్ గడ్డ పైనుంచే ప్రారంభిస్తున్నానని చెప్తూ, గత 70 ఏళ్లుగా ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని అంత సులభంగా సరిదిద్దలేమని, అయినప్పటికీ మొక్కవోని దీక్షతో ఆదివాసీల సమస్యలను పరిష్కరించడానికి శ్రమిస్తున్నానని సీఎం రేవంత్ అన్నారు.

ఏ పేదోడు గుడిసెలో ఉండొద్దు..

తాను గతంలో పీసీసీ అధ్యక్షుడిగా నిర్మల్‌లోనే మొదటి నిరసన చేపట్టానని, ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా దళిత, గిరిజన దండోరా నిర్వహించానని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాగోబా జాతరకు వచ్చినప్పుడే ఆదివాసీ పెద్దలను కలిసి వారి అవసరాలను అడిగి తెలుసుకున్నానని సీఎం పేర్కొన్నారు. ఆదివాసీ బిడ్డల సొంతింటి కల నెరవేర్చకపోతే ప్రభుత్వ లక్ష్యమే నెరవేరనట్లు అని వ్యాఖ్యానించిన సీఎం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎలాంటి రాజకీయాలు చూడబోమని స్పష్టం చేశారు. ఏ ఒక్క పేదవాడు కూడా గుడిసెలో ఉండకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని, గూడెంలో ఒక్క గుడిసే కూడా మిగలడానికి వీల్లేదని సీఎం అన్నారు.

సెప్టెంబర్‌లో మరో లక్ష ఇళ్ల గృహ ప్రవేశం..

రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా, ఆదివాసీల కోసం ప్రత్యేకంగా మరో 21 వేల ఇళ్లను అదనంగా మంజూరు చేస్తామని, వారికి నూటికి నూరు శాతం ఇళ్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు ఇళ్లు కట్టుకున్న ప్రతి లబ్ధిదారుడికి నిధులు జమ చేశామని, రాబోయే రోజుల్లో కూడా అవసరమైతే తల తాకట్టు పెట్టి అయినా సరే ఇందిరమ్మ ఇళ్లకు నిధులు అందిస్తానని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మరో లక్ష ఇళ్లలో లబ్ధిదారులు గృహ ప్రవేశం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

Next Story