విద్యాలయాల్లో వికృత చేష్టలు వద్దు : కె. పూజ

by Batti.Sumithra |

విద్యాలయాల్లో వికృత చేష్టలు వద్దు, ర్యాగింగ్ రహిత సమాజం దిశగా అడుగులు వేద్దామని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె. పూజ పిలుపునిచ్చారు.

విద్యాలయాల్లో వికృత చేష్టలు వద్దు : కె. పూజ
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : విద్యాలయాల్లో వికృత చేష్టలు వద్దు, ర్యాగింగ్ రహిత సమాజం దిశగా అడుగులు వేద్దామని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె. పూజ పిలుపునిచ్చారు. శనివారం భట్టుపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ నివాస మహిళా డిగ్రీ కళాశాల, వరంగల్‌లో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో "ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్–1997" చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన న్యాయమూర్తి కె. పూజ మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేసే ఒక సామాజిక భూతం అని పేర్కొన్నారు.

ర్యాగింగ్ అనేది కేవలం వినోదం కోసం మొదలై, నేడు మానసిక, శారీరక హింసకు, బలవన్మరణాలకు దారితీస్తోందని వాపోయారు. విద్యాసంస్థల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం, అవమానించడం నేరమని పేర్కొన్నారు. బాధితులు మానసిక ఒత్తిడికి లోనై, చదువును మధ్యలోనే ఆపివేయడం లేదా భయంతో ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతోందని వివరించారు. ర్యాగింగ్‌ను తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ, ర్యాగింగ్‌కు పాల్పడినట్లు రుజువైతే విద్యాసంస్థల నుంచి బహిష్కరించడమే కాకుండా, చట్టప్రకారం జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధిస్తారని తెలిపారు. ర్యాగింగ్ కేసుల్లో చిక్కుకున్న విద్యార్థులకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, పాస్‌పోర్ట్, ఇతర ఉన్నత అవకాశాలు లభించవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్. సురేష్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్. రజిని, కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. రాధిక, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story