- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Oman: రోజూ 15 గంటలు పని.. 4 నెలలుగా జీతం లేదు
ఉపాధి కోసం ఒమన్‌కు వెళ్లి అక్కడ యజమాని చేతిలో దారుణమైన వేధింపులకు గురైన ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్‌కు చెందిన షబ్నం బేగం అనే మహిళ.. ఉపాధి కోసం ఒమన్‌కు వెళ్లి అక్కడ యజమాని చేతిలో దారుణమైన వేధింపులకు గురైన ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. నెలకు 200 ఒమనీ రియాల్స్ జీతంతో ఇళ్లలో పని ఇప్పిస్తానన్న స్థానిక రిక్రూట్‌మెంట్ ఏజెంట్ నకిలీ హామీలను నమ్మి ఆమె ఈ ఏడాది మార్చి 26న మస్కట్ వెళ్లారు. అక్కడ చేరుకున్న మొదటి రోజు నుంచే నరకం మొదలైంది. రోజుకు 12 నుండి 15 గంటల పాటు విరామం లేకుండా ఒకటి కంటే ఎక్కువ ఇళ్లలో బలవంతంగా వెట్టిచాకిరీ చేయించారు. అంతేకాకుండా, కనీసం సరైన తిండి, వసతి కూడా ఇవ్వకుండా గత నాలుగు నెలలుగా జీతం ఎగ్గొట్టారని ఆమె పేర్కొన్నారు. ఈ చిత్రహింసలను భరించలేక యజమాని బారి నుండి చాకచక్యంగా తప్పించుకున్న షబ్నం బేగం ప్రస్తుతం మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ)లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె భద్రతను కాపాడాలని, సురక్షితంగా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే బతుకుదెరువు పేరుతో తమను మోసగించిన సదరు నకిలీ రిక్రూటింగ్ ఏజెంట్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తరపు బంధువులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.






