- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రహదారుల రక్త దాహం.. జాతీయ రహదారిపై నిత్య ప్రమాదాలు
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారిపై రోజుకో ప్రమాదం జరుగుతుంది. జాతీయ రహదారి రక్తంతో ఎరుపెక్కుతోంది.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారిపై రోజుకో ప్రమాదం జరుగుతుంది. జాతీయ రహదారి రక్తంతో ఎరుపెక్కుతోంది. జాతీయ రహదారి 353 పై అధిక వేగంతో వాహనాలు ప్రయాణించడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనదారులు ప్రాణాలు కోల్పోయి ఎన్నో కుటుంబాలు అనాథలవుతున్నాయి. కాళేశ్వరం నుంచి భూపాలపల్లి జిల్లా చివరి వరకు ఉన్న రహదారి సక్రమంగా లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారు. 353 జాతీయ రహదారిపై ప్రతి రోజు వెయ్యికి పైగా బొగ్గు, ఇసుక లారీలు ప్రయాణిస్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి.
దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు కొంచెం వేగంగా వెళ్లినా ప్రమాదాన్ని గురవుతున్నాయి. ఎంతో మంది యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించి తల్లిదండ్రులకు కన్నీరు మిగిలుస్తున్నారు. రెండు నెలలుగా భూపాలపల్లి జిల్లా జాతీయ రహదారిపై ముఖ్యంగా మేడిపల్లి టోల్గేట్ వద్ద, కమలాపూర్ క్రాస్ రోడ్ వద్ద, రేగొండ, ఘణపురం క్రాస్ రోడ్ వద్ద ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు రవాణా శాఖ, పోలీసు అధికారులు ఎలాంటి నియంత్రణ చేపట్టడం లేదు
ఇసుక, బొగ్గు లారీలతో ఇబ్బందులు..
ఇసుక, బొగ్గు లారీలతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. లారీలు, ద్విచక్ర వాహనాలు ఢీకొని ఎంతోమంది మరణిస్తున్నారు. పలువురు కాళ్లు చేతులు కోల్పోయి దివ్యాంగులుగా మారుతున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోతే వారి బతుకులు రోడ్డు పాలవుతున్నాయి. బైక్‌లపై ముగ్గురు, నలుగురు ప్రయాణించడానికి సైతం పోలీసులు నివారించలేకపోతున్నారు. ఇటీవల ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్లి రుద్రారం వద్ద ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మరణించగా ఒకరు కోమాలోకి వెళ్లిపోయారు. పది రోజుల క్రితం మేడిపల్లి వద్ద ఇసుక లారీ, బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం కమలాపూర్ క్రాస్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
గురువారం రాత్రి కారు, బైక్ఢీకొనడంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చారు. ఇలాంటి సంఘటనలు నెలలో కనీసం 20కి పైగా జరుగుతున్నప్పటికీ ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకులు వేయరాదని నిబంధన ఉండడంతో వాహనాలు పరిమితికి మించి వేగంగా ప్రయాణిస్తున్నాయి. దీంతో రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు ఒక కారణం. పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి మద్యం సేవించిన వారికి జరిమానాలు విధించినా తీరు మారడం లేదు. చట్టంలో కఠినమైన నిబంధనలు, శిక్షలు ఉంటే తప్ప ప్రమాదాలు తగ్గే అవకాశాలు లేవని పలువురు పేర్కొంటున్నారు.






