- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మేడారం మహా జాతరకు 3 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉంది’: మంత్రులు
సమ్మక్క–సారలక్క జాతరను కుంభమేళాకు మించి ఘనంగా నిర్వహించాలి..

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: సమ్మక్క–సారలక్క జాతరను కుంభమేళాకు మించి ఘనంగా నిర్వహించాలి.. ఈనెల 28వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు ఈసారి దాదాపు మూడు కోట్లమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్షణ్ కుమార్, దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. మంగళవారం మేడారం జాతరపై డా. బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సవ్యసాచి ఘోష్, అడిషనల్ డీజీలు విజయ్ కుమార్, స్వాతి లక్రా, వివిధ శాఖ కార్యదర్శులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు.
2 వందల 51 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు..
ఈ సందర్బంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ మాట్లాడుతూ.. 2024 మేడారం జాతరకు కోటిన్నర మంది హాజరుకాగా, ఈసారి జాతరకు దాదాపు గతంలో ఎన్నడూ లేనివిధంగా మూడు కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. 2 వందల 51 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని, సమ్మక్క–సారలక్క జాతరను కుంభమేళాకు మించి అద్భుతంగా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని అధికారులకు సూచించారు. మహాజాతరను విజయవంతంగా నిర్వహించడానికి ప్రతి అధికారికి ఒక బాధ్యతగా తీసుకుని ఏ చిన్న లోపం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు.
వైద్య సేవలు వంటి అన్ని విభాగాల్లో సమగ్ర ఏర్పాట్లు..
ప్రభుత్వం కేటాయించిన నిధులతో మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు వంటి అన్ని విభాగాల్లో సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నామని, జాతరకు వచ్చే భక్తులు సులభంగా దర్శనాలు చేసుకొని తిరిగి గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. భక్తులు ఎలాంటి అయోమయానికి గురికాకుండా ట్రాఫిక్ నియంత్రణ పటిష్టంగా ఉండాలని, ప్రత్యేక రూట్ మ్యాప్‌లతో పాటు అవసరమైన చోట వన్‌వే వ్యవస్థ అమలు చేయాలని సూచించారు. మన రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని, పార్కింగ్ విషయంలో వీఐపీలు సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు.
భద్రతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి..
మంత్రి సీతక్క మాట్లాడుతూ... ఈసారి జాతరకు 150 కోట్లతో గద్దెల పునరుద్ధరణ పనులు, 101 కోట్లు రూపాయలతో సౌకర్యాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులను మంజూరు చేశారని వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తుడు సాఫీగా దర్శనం లభించేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందుకు ప్రతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖ కార్యదర్సులు, హెచ్.ఓ.డీ లతో ప్రత్యేకంగా వాట్స్-అప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి జాతర నిర్వహణపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సీతక్క సూచించారు. శానిటేషన్, తాగునీరు, రవాణా, భద్రతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ప్రధానంగా మరుగుదొడ్లను మరింత పెంచాలని కోరారు. జాతర సందర్భంగా గురు, శుక్ర వారాల్లోనే ప్రతి రోజు కనీసం 40 లక్షల మంది భక్తులు ఉంటారని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
వచ్చే వందేళ్లకు నిలిచిపోయే విధంగా...?
మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2010 సంవత్సరం నుండి ప్రతి జాతరకు వస్తున్నారని, వచ్చే వందేళ్లకు నిలిచిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు మొట్టమొదటిసారిగా చేపట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు మాట్లాడుతూ.. జాతర నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నందున అన్ని శాఖల ఉన్నతాధికారులు జాతర పనులకు సకాలంలో పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సాధించాలని, మేడారానికి వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ లను ఉపయోగించుకోవాలన్నారు. జాతర సమాచారాన్ని నియమ నిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్ ను/ క్యూఆర్ కోడ్ రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.
పార్కింగ్ ఏరియాలలో సైతం ప్రత్యేకంగా మంచినీరు..
పార్కింగ్ ఏరియాలలో సైతం ప్రత్యేకంగా మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతీరోజూ తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఈ సందర్బంగా, మేడారం జాతరకు వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టిన పనులు, వాటి పురోగతిపై ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. మేడారం జాతరపై ములుగు జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్, వీడియోలను మంత్రులు సీతక్క, లక్షణ్ కుమార్, సి.ఎస్ రామకృష్ణ రావు లు ఆవిష్కారించారు. సమీక్ష సమావేశంలో జిల్లా రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.






