- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Medaram Jatara 2026 : మేడారం జాతరలో ఆయుష్ వైద్య సేవలు
సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయుష్ వైద్యశిబిరానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

దిశ, మేడారం న్యూస్ నెట్వర్క్: సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయుష్ వైద్యశిబిరానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆయుష్ (AYUSH) వైద్య శిబిరం ద్వారా ఇప్పటికే 6 వేల మందికి పైగా భక్తులు ఉచితంగా చికిత్స పొందారు. జనవరి 6వ తేదీ నుంచి ఆయుష్ వైద్య సేవలు ప్రారంభం కాగా, సంప్రదాయ వైద్య విధానాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో రోజురోజుకూ శిబిరాన్ని ఆశ్రయించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మేడారానికి వచ్చే భక్తుల్లో ముఖ్యంగా కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఆయుష్ శిబిరానికి వస్తున్నారని వైద్యులు తెలిపారు.
ఒక్కరోజే 828 మందికి చికిత్స
ఇప్పటి వరకు మొత్తం 6 వేల మందికి పైగా భక్తులు ఆయుష్ వైద్య సేవలు పొందగా, ఒక్కరోజే 828 మంది భక్తులు చికిత్స పొందారు.వారిలో ఆయుర్వేదం 286 మంది, యునానీ 223 మంది, హోమియోపతి 329 మంది వినియోగించుకున్నారు.
ఆయుష్ మందులపై పెరిగిన విశ్వాసం
దుష్ప్రభావాలు లేని సంప్రదాయ వైద్య విధానాలపై భక్తుల్లో విశ్వాసం పెరుగుతున్నదని ఆయుష్ వైద్యులు తెలిపారు. గతంలో కంటే ఈసారి ఆయుష్ వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో శిబిరానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోందని పేర్కొన్నారు.
పూర్తి స్థాయి వైద్య సిబ్బంది, మందుల అందుబాటు
మేడారం జాతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయుష్ వైద్య శిబిరంలో 25 నుంచి 30 మంది సిబ్బంది, ముగ్గురు ఆయుష్ వైద్యులు, ఫార్మాసిస్టులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. భక్తులకు అవసరమైన అన్ని రకాల ఆయుష్ మందులను ముందుగానే సమకూర్చి, ఎలాంటి కొరత లేకుండా చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తుల సేవలో ఆయుష్
మేడారం మహాజాతరకు తరలివచ్చే భక్తులకు సంప్రదాయ వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆయుష్ వైద్య శిబిరం ద్వారా భక్తులకు సురక్షితమైన, ప్రభావవంతమైన చికిత్స అందుతోందని అధికారులు వెల్లడించారు. ఆయుష్ వైద్య సేవల పట్ల భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
MORE NEWS ......






